calender_icon.png 28 July, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెప్టెంబర్‌లోనే సెట్స్‌పైకి

25-07-2025 01:46:45 AM

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఎవరికి వాళ్లు తమ సినిమానే ముందు సెట్స్‌పైకి వెళ్తుందని చెప్తున్నారు. కానీ ఏది ముందు పట్టాలెక్కుతుందనే విషయమై ఓ క్లారిటీ అయితే రావడంలేదు. ఇలాంటి సమయంలో ‘స్పిరిట్’ ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ‘రాజాసాబ్’ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది.

‘ఫౌజీ’ షూట్ కూడా సగానికి పైగా పూర్తయ్యింది. ఈ రెండింటి తర్వాత ప్రభాస్ తర్వాత చేయబోయే సినిమా ఏమిటనేది చాలా రోజులుగా సందేహం ఉండిపోయింది. అయితే, ప్రభాస్ తర్వాత చేయబోయేది ‘స్పిరిట్’ సినిమానే అని చెప్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇటీవల నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా కూడా ఈ విషయమే చెప్పారు.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారు సందీప్ వంగా. మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలైపోయాయి. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే మూడు పాటలు కంపోజ్ చేసేశారు. మెక్సికో సహా మరికొన్ని విదేశాల్లో లొకేషన్స్ రెక్కీ కూడా అయిపోయింది. ఈ సినిమాను సింహ భాగం విదేశాల్లోనే షూట్ చేయబోతున్నారు.

ఒక్కసారి షూటింగ్ ప్రారంభించిన తర్వాత నిర్విరామంగా పూర్తి చేస్తామనిని నమ్మకంగా చెప్తున్నారు. ప్రభాస్ ఈ సినిమా కోసం 90 రోజులు బల్క్ డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. 2026 ద్వితీయార్ధంలో విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా, ఆయన సరసన త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటించనుంది.