01-07-2025 02:05:05 AM
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బీజేపీ అధిష్ఠానం మరింత పెద్ద బాధ్యత అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకుగాను ఆయనకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి వరించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఉత్తరాదిలో బలంగా ఉన్న బీజేపీ.. దక్షిణాదిలో గట్టిగా పాగా వేసేందుకు యత్నిస్తోంది.
అందుకు గేట్‌వేలా ఉన్న తెలంగాణ కు చెందిన కీలకనేత కిషన్‌రెడ్డిని పార్టీ జాతీయ అధ్యక్షున్ని చేసేందుకు అధిష్ఠానం దృష్టి పెట్టిందని తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీలోనే కుమ్ములాటలు ఉన్నా, పార్టీకి నష్టం కలిగించేందుకు ప్రయత్నించే వారు న్నా కూడా అందరినీ కలుపుకుని పోయి గత పార్లమెంట్ ఎన్నికల్లో 8ఎంపీ స్థానాలు సాధించడంతో పార్టీ ఆయనపై మరింత నమ్మకాన్ని పెట్టుకుంది.
ఎలాంటి కష్టసమయంలోనైనా స్థిమితంగా పార్టీని ముందుకు నడిపిస్తారనే పేరు రావడం ఆయనకు బాగా కలిసివచ్చే అవకాశంగా మారింది. దానికి తోడు పార్టీకి నమ్మకమైన వ్యక్తుల్లో దక్షిణాదిలో ఆయన తర్వాతే ఎవరైనా అని పార్టీనేతలు చెబుతుంటారు. అందుకే కిషన్‌రెడ్డికి పార్టీ మంచి అవకాశాలు కల్పిస్తూ వచ్చిందని భవిష్యత్తులోనూ కల్పిస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తు న్నాయి.
అందుకే మొదట ఆయనను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మార్చి దక్షిణాదిలో పట్టు సాధించే అవకాశాలను సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ మరింత బలం పెరగాలంటే.. జాతీయ అధ్యక్షుడి హోదా తెలంగాణ నేతకే కల్పిస్తే మంచిదని హైకమాండ్ అభిప్రాయపడుతోంది. సౌమ్యుడు, విధేయుడు.. కావడం, ఎలాంటి మచ్చ లేకపోవడం ఆయనకు ప్లస్ పాయింట్స్.
ఏపీ, తెలంగాణకు చిరపరిచితుడు కావటం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. 2014లో తెలంగాణ తొలి బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగా నియమితులైన కిషన్‌రెడ్డి.. 2023 జూలై 4న మరోసారి తెలంగాణ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి.. బీజేపీ బలం పుంజుకునే రీతిలో వ్యవహరించారు.
అందుకే ఈ సారి జాతీయ అధ్యక్షు డిగా కీలకపాత్ర పోషించే అవకాశం లభిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి దక్షిణాదిలో పార్టీ బలంగా మారడంతో పాటు ఆ సమయానికి ఏదైనా సెంటిమెంట్‌తో కలిసివస్తే కిషన్‌రెడ్డిని తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.