30-08-2025 02:16:19 AM
కామారెడ్డి/ మెదక్/ నిర్మల్, ఆగస్టు 29 (విజయక్రాంతి): భారీ వర్షాలతో జలమయమైన ఉత్తరాది జిల్లాలు వరద ప్రభావం నుంచి కోలుకుంటున్నాయి. కామారెడ్డి జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాలు, వరద తాకిడికి లోనై ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కట్టుబట్టలతో ఇండ్ల నుంచి వెళ్లిన బాధితులు, నాలుగో రోజుకు శుక్రవారం ఇంటికి చేరుకున్నారు.
ఇండ్లల్లో మోకాలు లోతు బురద దర్శనమివ్వడంతో.. కన్నీటి పర్యంతమయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీ, ఎన్జీవోస్ కాలనీ, కౌండిన్య ఎంక్లేవ్, విద్యానగర్, దేవీవిహార్, రాజానగర్, బతుకమ్మకుంట కాలనీల్లోని 500 కుటుంబాలు తమ ఇండ్ల వద్దకు వరద బీభత్సం సృష్టించిన తీరును చూసిబోరున విలపించారు. ఇండ్లల్లోని ఏ ఒక్క వస్తువు పనికి రాదని వారు వాపోయారు. అగ్నిమాపక, మున్సిపల్ శాఖ అధికారులు బురదమయమైన ఇండ్లలో నీటి ద్వారా శుభ్రం చేయిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా బాధితులకు తాగునీరు, పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరులో గుంతలు పడిన రోడ్లను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు. తక్షణ ఏర్పాట్లు చేయాలని ఆర్‌అండ్‌బీ నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డి మండలంలోని పోచారం ప్రాజెక్ట్‌కు గండి పడి బరాజ్‌కు ప్రమాదం పొంచిఉండటంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు గండిని ఇసుక సంచులతో పూడ్చాయి.
నిజాంసాగర్ ప్రాజెక్టు కింద వరద ముంపునకు గురైన గ్రామాల ప్రజలను ఎస్పీ రాజేశ్ చంద్ర సందర్శించారు. జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, డోంగ్లీ తదితర మండలాల పరిధిలోని వరద ఉదృతిలో చిక్కుకున్న గ్రామాల ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించిన అధికారులు, వారికి భోజన ఏర్పాట్లు చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బాధిత కుటుంబాలను పరామర్శించారు.
బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూరు, నస్రుల్లాబాద్‌లలో వరద బాధితులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్ మండలాల్లోని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆందోళన చెందొద్దని భరోసా కల్పించారు. వరదల తాకిడితో అతలాకుతులమైన కామారెడ్డి జిల్లాలో భారీ నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
మెదక్ జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. చెరువులు, వాగులు, ప్రాజెక్టులు, నదులు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శుక్రవారం వర్షం తగ్గుముఖం పట్టడంతో జిల్లాలో అధికార యంత్రంగం పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. వర్షం తగ్గినా చాలా గ్రామాల మధ్య రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు ఇంకా ప్రారంభం కాలేదు.
వరద ఉధృతి తగ్గినప్పటికీ హవేలీ ఘన్‌పూర్ మండలం దూప్‌సింగ్ తండా వాసులు నిర్బంధంలోనే ఉన్నారు. బురద పేరుకుపోవడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మెదక్ మండలం కొంటూర్ చెరువు అలుగు పారుతుండడంతో 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రామాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నార్సింగి మండలం వల్లభాపూర్ వద్ద ఎన్‌హెచ్ రహదారి తెగిపోయిన రోడ్డును అధికారులు పునరుద్ధరిస్తున్నారు.
వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు తేలాయి. సుమారు 1500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కలెక్టర్ రాహుల్ రాజ్ రహదారులు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి మరమ్మతు పనులు చేయాలని ఆదేశించారు.
నిర్మల్ జిల్లాలో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను మాజీమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరామర్శించారు. రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నరసాపూర్ మండలంలోని దేవుడి చెరువు గండిపడటంతో ఆ చెరువును పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు.