30-08-2025 02:17:56 AM
విజయవంతంగా చికిత్స చేసిన ఏఐఎన్యూ వైద్యులు
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న ఓ పేషెంట్‌కు హైదరాబాద్‌లోని ఏఐఎన్యూ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్ చేసి తొలగించారు. సరూర్‌నగర్‌కు చెందిన ఒక యువతి (29)కి కిడ్నీలో పదేపదే రాళ్లు ఏర్పడుతున్నాయి. అయితే అందుకు కారణమేంటో తెలియలేదు. ఆమెకు పరీక్ష చేస్తే.. మెడలో ఆమెకు ఏర్పడిన పారాథైరాయిడ్ ఎడినోమా అనే ఒక రకమైన కణితి కారణమని, దానివల్ల పారాథైరాయిడ్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయ్యి, రక్తంలో కాల్షియం స్థాయి పెరిగిపోయి చివరకు కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయని తేలింది.
వారం రోజుల నుంచి విపరీతంగా నడుం నొప్పి, మూత్రానికి వెళ్తే మంట, వాంతులు అవుతున్నాయి. ఆమెకు ఇంతకుముందు చాలాసార్లు కిడ్నీ లో రాళ్లకు శస్త్రచికిత్సలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను దిల్‌షుఖ్‌నగర్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ)లోని కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సుభాశ్ చంద్రబోస్ ఇంటూరి తెలిపారు. ‘ఇది చాలా అరుదైన, విభిన్నమైన కేసు. పరీక్షలు చేస్తే ఆమెకు రెండువైపులా కిడ్నీలలో రాళ్లు ఉన్నాయని, అవి మూత్రం బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయని తెలిసింది.
ఆ రాళ్లను దశలవారీగా తొలగించాం. తర్వాత ఆమెకు పరీక్షలు చేయగా, రక్తంలో కాల్షియం స్థాయి, పారాథైరాయిడ్ హార్మన్ ఎక్కువగా ఉన్నా యి. దాంతో ఆమెకు పారాథైరాయిడ్ సింటిగ్రఫీ, స్పెక్ట్ సీటీ చేయగా.. మెడలో ఎడమవైపు పారాథైరాయిడ్ గ్రంధిలో కణితి కనిపించింది. ఈ సమస్యకు అదే కారణమని గుర్తించి, శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించాం.’ అని ఆయన వివరించారు.
అనంతరం డాక్టర్ సుభాశ్ చంద్రబోస్, ఏఐఎన్యూ యూరాలజీ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ నారాయణం మాట్లాడుతూ ‘కేవలం కిడ్నీలో రాళ్లు తొలగిస్తే చాలదు. కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు చేస్తే పదేపదే రాళ్లు ఎందుకు ఏర్పడుతున్నాయో తెలుస్తుంది. దీనిపై రోగులకు అవగాహన కల్పించాలి. పిల్లల్లోకూడా ఇలా రెండువైపులా రాళ్లు ఏర్పడితే అందుకు కారణం ఏంటో తెలుసుకుని దానికి చికిత్స చేయాలి’ అని ఆయన తెలిపారు.