calender_icon.png 3 January, 2026 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో కొల్లూరు ఎస్‌ఐ

03-01-2026 12:09:05 AM

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన రమేశ్

సంగారెడ్డి, జనవరి 2(విజయక్రాంతి) : సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఎస్‌ఐ ఎం.రమేశ్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు.లంచం తీసుకుంటున్న సమయంలో దాడులు నిర్వహించి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల మేరకు పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపునకు సంబంధించిన కేసులో లారీ యజమానిపై కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.ఈ కేసులో లారీ యజమాని పేరు తొలగించేందుకు ఎస్‌ఐ రమేశ్ రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఇందులో భాగంగా డిసెంబర్ 17న రూ.5 వేలు తీసుకుని, మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శుక్రవారం కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో రూ.20 వేలు లంచం అందజేస్తుండగా ఎస్‌ఐ రమేశ్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడి అక్రమ లాభం పొందినట్లు నిర్ధారణ కావడంతో నిందిత ఎస్‌ఐని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని II అదనపు ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపర్చనున్నట్లు ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఎస్‌ఐకు సంబంధించిన ఆస్తులపై కూడా విచారణ కొనసాగుతోందన్నారు.