04-08-2025 07:51:43 PM
గైర్హాజరు వైద్యులకు షోకాజు నోటీసు..
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్..
దండేపల్లి (విజయక్రాంతి): వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్(District Medical Health Officer Dr. Harish Raj) ఆదేశించారు. సోమవారం దండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)తో పాటు జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి ఎలాంటి అనుమతి లేకుండా సెలవులో ఉన్న జన్నారం పీహెచ్ సీ వైద్యురాలు లక్ష్మికి షోకాజు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా డీఎం అండ్ హెచ్ఓ వైద్యాధికారులకు, పారామెడికల్ సిబ్బందికి, సూపర్ వైజర్లకు సూచనలిచ్చారు. పీహెచ్సీలలో, సబ్ సెంటర్లలో వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున ఎలాంటి సెలవులుండవని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సెలవులు తీసుకోవాలని, మంజూరు చేసుకోవాలన్నారు.
అవసరమున్న చోట వైద్య శిభిరాలు..
సీజనల్ వ్యాధులు ప్రభావిత గ్రామాలలో వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ హరీష్ రాజ్ కోరారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసే గ్రామాల్లో ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఈ శిబిరము పెట్టినప్పుడు గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉంటూ ఇంటింటికి తిరిగి రోగులను గుర్తించి శిభిరాలకు సహకరించేలా చూడాలని కోరారు. అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కోరారు.
కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామపంచాయతీ సెక్రటరీ ద్వారా గ్రామాలలో పరిసరాల పరిశుభ్రతపైన, దోమలు నిలువ లేకుండా, దోమలార్వాలు ఉండకుండా చర్యలు చేపట్టాలని, పాగింగ్ కార్యక్రమాలు చేయాలని డ్రైడే ప్రతి వారంలో రెండు రోజుల పాటు (మంగళ, శుక్రవారం) చేయాలని, అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో వైద్య శిబిరాలు..
పీహెచ్సీల పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలను వైద్యులు, సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు సందర్శించాలని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ హరీష్ రాజ్ ఆదేశించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, విద్యార్థులకు అందిస్తున్న భోజనము, వంటగదిని పరిశీలించి వంట చేసే వారికి పరిశుభ్రతపై అవగాహన కలిగించాలన్నారు. ఫార్మసిస్టులందరూ ఈ సంజీవనిలో నమోదు చేయాలని, ఉప కేంద్రంల వారీగా మందులను అందజేయాలని, పరీక్షలు చేసి వైద్యం అందించాలన్నారు.
అదే విధంగా తెలంగాణ డయగ్నస్టిక్స్ కు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి శాంపిల్స్ పంపించడం, రిపోర్ట్స్ ను తెలుసుకొని ఇతర ప్రివెంటివ్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్నందున వాటిపైన పరీక్షలు చేస్తూ అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా రౌండ్ క్లాక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాయంత్రం ఉండే వైద్య సిబ్బంది వివరములను గోడ పైన ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో అసంక్రమణ వ్యాధులు (ప్రోగ్రామ్ ఆఫీసర్) డాక్టర్ ప్రసాద్, డాక్టర్ ఉమాశ్రీ, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ హరీష్, డెమో బుక్క వెంకటేశ్వర్, వైద్య సిబ్బంది, ఫార్మసిస్టులు, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.