calender_icon.png 5 August, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని లోక్ సభలో గళమెత్తిన ఎంపీ కడియం కావ్య

04-08-2025 10:02:03 PM

హన్మకొండ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(Indian Institute of Management) ఏర్పాటుపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య(MP Dr. Kadiyam Kavya) డిమాండ్ చేశారు. దేశంలో ఐఐఎం లేకపోయిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని ఎంపీ గుర్తు చేశారు. లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐఐఎంకు అవసరమైన భూమి, మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. “హైదరాబాద్‌లో ఇప్పటికే ఐఎస్బి, ఐఐటి హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉందని ఎంపీ పేర్కొన్నారు.

వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్‌ స్పందిస్తూ – ప్రస్తుతం హైదరాబాదులో ఐ ఐ ఎం స్థాపనకు ఎటువంటి ప్రతిపాదన కేంద్రం వద్ద పరిశీలనలో లేదని చెప్పారు. దేశంలో ఇప్పటికే 21 ఐ ఐ ఎం లు ఉన్నాయని వివరించారు. కేంద్రం స్పందనపై వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని యువతకు మంచి మేనేజ్‌మెంట్ విద్య అవసరంఉందన్నారు. కేంద్రం ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం శక్తివంతమైన వృద్ధిని కొనసాగించడానికి, పరిశ్రమ, ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి నాణ్యమైన మానవ వనరుల అవసరం కీలకంగా మారిందన్నారు. 

ఇండస్ట్రియల్, ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటి డిమాండ్ లను తీర్చేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి తెలంగాణ రాష్ట్రానికి తప్పనిసరి  ఐ ఐ ఎం మంజూరు చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014, సెక్షన్ 93 ప్రకారం అపాయింటెడ్ డే నుంచి 10 ఏళ్ల వ్యవధిలో వారసత్వ రాష్ట్రాల పురోగతి, స్థిరమైన అభివృద్ధి కోసం షెడ్యూల్ 13లో పేర్కొన్న విధంగా తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.