20-01-2026 12:00:00 AM
బోనం ఎత్తిన కొండపోచమ్మ
కొమురవెల్లి, జనవరి 19: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం సోమవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. శివ శివసత్తుల పూనకాలతో ఒకరికొకరు బండారి (పసుపు) చల్లుకోవడంతో తోటబావి ప్రాంతం బండారి మాయమైంది. సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చెందిన యాదవులు, ఒగ్గు పూజారులు పట్నం సంబంధించిన ఏర్పాట్లను చేశారు.
మరోవైపు ఒగ్గు పూజారులు ఒగ్గు కళా రూపంలో మల్లన్న చరిత్రను చెప్పారు. ఆలయ అనువంశిక అర్చకులు గర్భగుడి నుంచి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికకు ఊరేగింపుగా తీసుకువచ్చి పట్నం, అగ్నిగుండాలను దాటించారు. ఆ తర్వాత శివసత్తులు, భక్తులు పూనకాలతో నృత్యం చేస్తూ, శివ స్మరణ చేసుకుంటూ, భక్తి పారవశంతో పట్నాన్ని అగ్నిగుండాలను దాటారు. అగ్నిగుండాలను దాటిన భక్తులు సరాసరిగా గర్భగుడిలోని మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. అంతకుముందు కార్యక్రమం జరిగినంత సేపు భక్తులు మల్లన్న స్మరణ చేస్తూ బతుకమ్మల ఆడారు.
మల్లన్న స్వామిని దర్శించుకున్న భక్తులు సమీపంలో ఉన్న జగదేవపూర్ మండల పరిధిలోని కొండపోచమ్మ ఆలయానికి బయలుదేరారు. భాగ్యనగరం నుంచి వచ్చిన భక్తులు మల్లన్న దర్శించుకున్న వారంతా కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. దీంతో దారులన్నీ కొండపోచమ్మ వైపే సాగాయి. భక్తులంతా ఒకేసారి బయలుదేరడంతో రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి.
ఆలయ ప్రాంగణం లో హైదరాబాద్ నివాసి భోయిని సాయి యాదవ్ సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యఅతిథిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హాజరయ్యారు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారి ప్రాంగణంలో చండీ హోమం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు తీగుల్ నర్సాపూర్ సర్పంచ్ సంధ్య శ్రీనివాస్, ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు స్వామి,మాజీ చెర్మన్ అను గీత, నాయకులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.