20-01-2026 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 19 (విజయక్రాంతి): సైబర్ నేర బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీ-మిత్ర కార్యక్రమం అద్భుత ఫలితాలను ఇస్తోంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కమిష నర్ సజ్జనార్ జనవరి 9న ప్రారంభించారు. సైబర్ మోసానికి గురైన వారు 1930 నంబరుకు లేదా జాతీయ పోర్టల్లో ఫిర్యాదు చేస్తే సరిపోతుంది.
ఆ వెంటనే సీ-మిత్ర బృందం రంగంలోకి దిగుతుంది. బాధితులకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీసి, ఏఐ సాంకేతికతతో లీగల్ అంశాలతో కూడిన పక్కా ఫిర్యాదు డ్రాఫ్ట్ను సిద్ధం చేసి వాట్సాప్ లేదా మెయిల్‌కు పంపిస్తారు. బాధితులు ఆ ఫిర్యాదును ప్రింట్ తీసుకొని, సంతకం చేసి బషీర్బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్‌కు కొరియర్ లేదా పోస్ట్ ద్వారా పంపాలి. ఆ కాపీ అందగానే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఆ కాపీని బాధితుల మొబైల్కే మెసేజ్ రూపం లో పంపిస్తున్నారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన పది రోజుల్లోనే సీ-మిత్ర బృందం ఏకంగా వెయ్యి మంది బాధితులకు స్వయం గా ఫోన్ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సా యంతో 200 మందికి పక్కాగా న్యాయపరమైన ఫిర్యాదు డ్రాఫ్టును సిద్ధం చేసి పంపింది. బాధితుల నుంచి సంతకం చేసిన ప్రతులు అందగానే.. ఎక్కడా జాప్యం లేకుండా 100కి పైగా ఎఫ్‌ఐఆర్లను నమోదు చేశారు. సీ-మిత్ర సేవలను వేగంగా బాధితులకు అందించేందుకు సైబర్ క్రైం విభాగం 24 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. రెండు షిప్టుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ వర్చువల్ హెల్ప్‌డ్డెస్క్ బాధితులకు అందుబాటులో ఉంటోం ది. రోజుకు సగటున 100 ఫోన్ కాల్స్ చేస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు.
సోదరిలా అండగా నిలుస్తున్నాం
మోసపోయామన్న బాధలో ఉన్నవారు పోలీస్ స్టేషన్‌కు రావాలంటేనే భయపడతారు. కానీ, మేమే స్వయంగా ఫోన్ చేసి.. భయపడకండి, మీకు న్యాయం చేయడా నికి మేమున్నాం అని చెప్పగానే వారిలో వచ్చే ధైర్యం వెలకట్టలేనిది. నేను ప్రతి రోజు 20 మందికి ఫోన్ చేస్తా. ఒక పోలీసులా కాకుండా, సోదరిలా వారి సమస్యను విని పరిష్కరిస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది.
కానిస్టేబుల్
సైబర్ బాధితులు లేని సమాజమే లక్ష్యం
టెక్నాలజీని, మానవతా దృ క్పథాన్ని జోడించి హైదరాబాద్ పోలీసులు సృష్టిస్తున్న ఈ డిజిటల్ విప్లవంలో భాగస్వామిని కావడం గర్వంగా ఉంది. గతంలో ఫిర్యాదు ఎలా రాయాలో తెలియ క బాధితులు సతమతమయ్యేవారు. భవిష్యత్తులో హైదరాబాద్‌లో ఒక్క సైబర్ బాధితుడు కూడా లేకుండా చేసి.. సీ-మిత్ర బంద్ అయ్యే అవసరం లేని విధంగా మేమంతా పనిచేస్తున్నాం.
కానిస్టేబుల్