12-07-2025 12:31:59 AM
నాగార్జునసాగర్/భద్రాచలం, జూలై 11: కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. శ్రీశైలం నిండుకుండలా మారింది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో రూపంలో 1,48,696 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 882.80 అడుగులుగా ఉంది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అయితే ప్రస్తుతం 203.4290 టీఎంసీలుగా ఉంది. ఇక్కడ మూడు గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తున్నది. ఎగువ నుంచి వచ్చిన వరద సాగర్ క్రస్ట్ గేట్లను తాకింది. వచ్చేవారం రోజుల్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే ప్రాజెక్ట్ నీటి మట్టం 547అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,18,167, ఔట్ ఫ్లో 1100 క్యూసెక్కులుగా ఉన్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 546 అడుగులకు చేరుకుంది వరద ఇలాగే కొనసాగితే ప్రాజెక్ట్ మరో వారం రోజుల్లో నిండే అవకాశం ఉంది.
పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
గోదావరి ఎగువ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు గోదావరి ఉపనదులు పొంగి ప్రవహించడం వల్ల భద్రాచల వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్నది. శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు 37.60 అడుగులకు చేరుకొని ఇంకా పెరుగుతూనే ఉన్నది. ఇదేవిధంగా శనివారం మధ్యాహ్నం వరకు పెరగవచ్చని అధికారులు తెలియజేశారు. దీంతో స్నాన ఘట్టాలు నీటిలో మునిగాయి.
వరద పెరుగుతూ ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనావేసి అందుకు సిద్ధంగా ఉన్నారు. భద్రాచలం వద్ద 37.60 అడుగులకు చేరుకోవడంతో 6,98,510 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తున్నది. గోదావరి నదికి భద్రాచలం వద్ద 43 అడుగులు కు రాగానే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులు చేరుకోగానే రెండవ ప్రమాద హెచ్చరిక, 53 అడుగులు చేరుకోగా మూడవ ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేసి సహాయ కార్యక్రమాలకు పాల్గొంటారు.