27-01-2026 01:25:08 AM
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేకులుగా కాంగ్రెస్, బీజేపీ పోటా పోటీ
రేవంత్ రెడ్డి పాలనలో ‘అనుముల రాజ్యాంగం’
అడుగడుగునా రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి) : తెలంగాణలో ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన ‘ప్రజా పాలన’ సాగడం లేదని, ఇది కేవలం రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న ‘రాక్షస పాలన’ నడుస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాజ్యాంగ ఉల్లంఘనలపై ప్రదర్శించిన లఘు నాటిక అందరినీ ఆలోచింపజేసింది.
ఈ ప్రదర్శన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. నేడు కేంద్రంలోని బీజేపీ, రాష్ర్టంలోని కాంగ్రెస్ పోటీ పడి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలనలో ‘ప్రజా పాలన’ మృగ్యమై ‘అనుముల రాజ్యాంగం’ నడుస్తోందని, ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ ఒకవైపు, రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న కాంగ్రెస్ మరోవైపు దేశానికి పెనుముప్పుగా మారాయన్నారు.
‘న్యాయ పత్రం’ కాదు.. అది ‘అన్యాయ పత్రం’
కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ తుక్కుగూడలో విడుదల చేసిన ‘న్యాయ పత్రం’లో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడారని, కానీ ఆ వేదికపైనే బీఆర్‌ఎస్ నుంచి ఫిరాయించిన వారు ఆయన పక్కనే కూర్చున్నారని గుర్తు చేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, కాంగ్రెస్ న్యాయ పత్రంలో న్యాయం అంతే ఉందని ఎద్దేవా చేస్తూ, దీన్ని ‘అన్యాయ పత్రం’గా పిలవాలని సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి ‘జెండా గద్దెలను కూల్చేయండి’ అని బహిరంగ సభల్లో పిలుపునివ్వడం శాంతిభద్రతలను, రాజ్యాంగ విలువలను సమాధి చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టంలో దళితులు, గిరిజనులు, జర్నలిస్టులపై జరుగుతున్న అకృత్యాలను కేటీఆర్ ఏకరువు పెట్టారు.
సీఎం ఫైనాన్షియల్ ఫ్రాడ్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రాజ్యాంగాన్ని రాష్ర్టంలో ఏ విధంగా తుంగలో తొక్కుతున్నారో కళ్లకు కట్టేలా తమ లఘు నాటిక ద్వారా వివరించారని కేటీఆర్ తెలిపారు. బాధ్యత గల విద్యార్థులుగా తమ విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి కాపాడుకోవడానికి వారు చేస్తున్న కషి దేశాన్నే కదిలించిందని కొనియాడారు. ఈ కుంభకోణం విలువ దాదాపు రూ. 10,000 కోట్లు ఉంటుందని, తనకు సంబంధం లేని భూములను, చెరువులను తాకట్టు పెట్టి ముఖ్యమంత్రి ‘ఫైనాన్షియల్ ఫ్రాడ్’కు పాల్పడ్డారని ఆ నివేదిక స్పష్టం చేసినట్లు కేటీఆర్ తెలిపారు.
సిట్ నోటీసులు.. అటెన్షన్ డైవర్షన్
ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. కేసులో బాధ్యులైన అధికారులను వదిలేసి, కేసుతో సంబంధం లేని ప్రతిపక్ష నాయకులకు వరుసగా విచారణకు పిలవడం కేవలం రాజకీయ కక్షసాధింపు. అటెన్షన్ డైవర్షన్ లో భాగమేనని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న భారీ అవినీతి, కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ విచారణను ఒక ఆయుధంగా వాడుకుంటోందని మండిపడ్డారు. మంగళవారం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్‌కు బొగ్గు కుంభకోణంపై వినతిపత్రం ఇస్తామని తాము ప్రకటించిన వెంటనే సంతోష్‌కు నోటీసులు రావడం యాదృచ్ఛికం కాదని, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన అటెన్షన్ డైవర్షన్ అని కేటీఆర్ విమర్శించారు.