17-05-2025 12:21:48 AM
- ఆరుగురు అరెస్టు, పరారీలో ఏడుగురు
- భార్యభర్తలే అసలు సూత్రదారులు!
- తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న దందా
- సరూర్‌నగర్‌లో ఘటన
ఎల్బీనగర్, మే 16: నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి, విక్రయిస్తున్న ముఠా సభ్యులు ఆరుగురిని రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. శుక్రవారం ఎల్బీనగర్‌లోని రాచకొండ క్యాంపు కార్యాలయంలో సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ కుంట్లూరు ప్రాంతానికి చెందిన తోట వెంకటభానుప్రకాష్(55), తోట సాగరిక(38) భార్యభర్తలు. వీరు కొంతకాలంగా సరూర్‌నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట సాత్విక ఎంటర్‌ప్రైజెస్ పేరుతో జిరాక్సు, టైపింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బు సంపాదించాలనే దురాలోచనలతో నకిలీ స్టాంపు పేపర్లు, నకిలీ సర్టిఫికెట్ల తయారీకి ముఠాను ఏర్పాటు చేశారు.
ఆ ముఠాలో నగరంలోని హుడాకాలనీ ఆసీఫ్ నగర్‌కు చెందిన సయ్యద్ ఫిరోజ్ అలీ(34), హయత్‌నగర్ హతిగూడ బొమ్మలగుడి ప్రాంతానికి చెందిన అడ్డగూడురు చంద్రశేఖర్(64), అడ్డగూడురు అనిల్ (35), అంబర్‌పేట్ ఆకాష్‌నగర్ ప్రాంతానికి చెందిన ఎండీ జలీల్(33), వరంగల్ జిల్లాకు చెందిన పులుసు మల్లేశ్‌గౌడ్(ఇతని స్వస్థలం నల్లగొండ జిల్లా చందుపట్ల గ్రామం), కామారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగి ప్రవీణ్, రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీలో తాత్కాలిక ఉద్యోగి డి సుధీర్‌కుమార్(27), రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ తాత్కాలిక ఉద్యోగి ముదస్సీర్, సరూర్ నగర్ మండలం బృందావన్ కాలనీకి చెందిన జల్లా కిశోర్‌కుమార్(44), ఖమ్మం పట్టణానికి చెందిన చంచల నిఖిల్, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సత్యప్రభుతో సహా మొత్తం 12మంది ఉన్నారు.
వీరంతా కలిసి సాత్విక ఎంటర్‌ప్రైజెస్ జిరాక్సు సెంటర్‌లో నకిలీ స్టాంపు పేపర్లు, నకిలీ సర్టిఫికెట్లు తయారు విక్రయిస్తున్నారు. ఈ దందా గత తొమ్మిదేళ్లుగా సాగుతున్నట్టు తెలుస్తున్నది. ఈ ముఠా సభ్యులపై ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులకు కీలక సమాచారం అందింది. దీంతో ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు, సరూర్ నగర్ పోలీసులు కలిసి శుక్రవారం ఈ ముఠా సభ్యులను అరెస్టు చేశారు.
ముఠాలోని తోట సాగరిక, తోట వెంకటభానుప్రకాష్, అడ్డగూడురు చంద్రశేఖర్, అడ్డగూడురు అనిల్, ఎండీ జలీల్, జెల్లా కిశోర్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఏడుగురు కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేస్తున్నట్లు వెల్లడించారు. వీరి నుంచి నకిలీ స్టాంపు పేపర్లు, నకిలీ సర్టిఫికెట్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
FAKE: నిందితులను చూపుతున్న రాచకొండ సీపీ సుధీర్‌బాబు