calender_icon.png 7 May, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్.. పతివ్రత మాటలు వద్దు

07-05-2025 12:31:42 AM

కాంగ్రెస్ ఎంపీ చామల ఫైర్

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తుల్లో కేటీఆర్ కూడా ఒకడని, కానీ ఇప్పుడు పతివ్రత మాటలు మాట్లాడుతున్నారని, ఆయన లాగే అందరూ కుంభకోణాలు చేస్తారనుకుంటే ఎలా? అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014 లో మిగులు బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రాన్ని చేతుల్లో పెడితే పదేళ్లలో రూ.8.5 లక్షల కోట్ల అప్పుల రాష్ర్టంగా మార్చింది మీరు కాదా?  కేటీఆర్ అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన ఘనకార్యాలనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు వివరిస్తున్నారని, దీనిలో మీకు తప్పేం కనిపించిందన్నారు.

గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు.. ఈ పగటి వేశాలేంది కేటీఆర్ అని ఎంపీ చామల నిలదీశారు. ‘మైకు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు అదే నిజమని అనుకుంటారా? బీఆర్‌ఎస్ హయాంలో ఏనాడైనా ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు వేశారా?’ అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మిస్ వరల్డ్ పోటీలపై కూడా కేటీఆర్ విషం వెళ్లగక్కుతున్నారని ఎంపీ మండిపడ్డారు. మిస్ వరల్డ్ పోటీలకు రూ.250 కోట్లు ఖర్చు చేస్తుందని ఆరోపిస్తున్నారని, ఆ పోటీలకయ్యే ఖర్చు కేవలం రూ.27 కోట్లేనని, ఇందులో చాలా వరకు ప్రభుత్వం స్పాన్సర్ల నుంచి సేకరిస్తోందని చెప్పారు.