16-08-2024 12:47:51 AM
మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 15(విజయక్రాంతి): ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్‌లు, రికార్డింగ్ డాన్స్‌లు చేసుకోవచ్చని అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ మహిళలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశా రు. ‘మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడమే మీ తండ్రి మీకు నేర్పిన సంస్కారమా?’ అని మండిపడ్డారు. ఆడవాళ్లను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు అనడం కేటీఆర్ బుర్రలో ఉన్న బురదకు నిదర్శమని ధ్వజమెత్తారు. గత పదేళ్లుగా హైదరాబాద్‌లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులను ప్రోత్సహించిన చరిత్ర మీది అని విరుచుకుపడ్డారు. మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని, శ్రామిక జీవులైన మహిళలు ప్రయాణ సమయంలో ఏదో పని చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు వారికి నచ్చవని, ఉచిత బస్సు ప్రయాణ ఆలోచనవారికి రాలేదని విమర్శించారు. ఆర్టీసీలో ప్రయాణించేవాళ్లు తప్పుడు పనులు చేస్తున్నారన్నట్టుగా సోషల్‌మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని మండిప డ్డారు.