24-05-2025 01:04:06 AM
ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్
గజ్వేల్, మే 23: కాలేశ్వరo బారాజ్ లను కాంగ్రెస్ నేతలు బాంబులు పెట్టి కూల్చారని కేటీఆర్ ఆరోపించడం పట్ల ఆయన మానసిక పరిస్థితిపై అనేక అనుమానాలు వస్తున్నాయని, ఆయనకు పిచ్చాసుపత్రిలో పరీక్షలు చేయించాలని గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ బిఆర్‌ఎస్ నేతలకు సూచించారు .
గజ్వేల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజహర్ జిల్లా కిసాన్ సెల్ కార్యదర్శి ముమ్మద్ అజ్గర్ తోహిద్ తో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బిఆర్‌ఎస్ పార్టీలో మూడు ముక్కలాటలో అభద్రతాభావంతో ఉన్న కేటీఆర్ మానసిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని బిఆర్‌ఎస్ నేతలు ఆయనను పిచ్చాసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించాలని సలహా ఇచ్చారు.
ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత ఆమె తండ్రి కెసిఆర్ కు రాసిన లేఖతోనే బిఆర్‌ఎస్ పార్టీ దుస్థితి అర్థమవుతుండగా, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ తంటాలు పడుతున్నట్లు చెప్పారు. కాలేశ్వరం అవినీతిని కాంగ్రెస్ పార్టీ మొదటినుండి బహిర్గతం చేస్తుండగా, నిష్పక్షపాతంగా జరుగుతున్న దర్యాప్తు కమిషన్ వద్ద వివరాలు వెల్లడించాలని సూచించారు. కమిషన్ ఎదుట హాజరు నుండి తప్పించుకోవడానికి కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావులు పన్నుతున్న కుట్రలో భాగంగానే రైతులు, ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు, కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో కెసిఆర్ కుటుంబం ఒక్కొక్కరుగా అమెరికా వెళ్తుండడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నట్లు తెలిపారు. ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు చారిత్రాత్మక కట్టడాలుగా నిలుస్తుండగా, కేవలం కమిషన్ల కోసం అంచనాలు పెంచి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వారి అవినీతిని బట్టబయలు చేసిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత కేసీఆర్ ప్రభుత్వo పూర్తిగా దిగజార్చినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు వివరించారు.