25-07-2024 08:41:48 PM
కరీంనగర్: భారత రాష్ట్ర సమితి నాయకుల బృందంతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం పర్యటనకు బయలుదేరింది. గురువారం సాయంత్రం కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యాంని కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సందర్శించారు. ఎండిన లోయర్ మానేరు, మిడ్ మానేరును చూసేందుకు వచ్చామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని, కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను ధాన్యగారంగా మార్చామని కేటీఆర్ తెలిపారు. చిన్న లోపాన్ని చూసి మొత్తం ప్రాజెక్టు విఫలం అన్నట్లు చేశారని, మేడిగడ్డ నుంచి ప్రతిరోజు లక్షల క్యూసెక్యుల నీళ్లు పోతున్నాయని ఆయన పేర్కొన్నారు. నీరు దిగువకు వృథాగా పోతున్నా.. ఎత్తిపోయటం లేదని, 10 లక్షల క్యూసెక్కుల వరద తట్టుకొని మేడిగడ్డ ఠీవీగా నిలబడిందన్నారు. ఇవాళ రాత్రికి రామగుండం వెళ్లి అక్కడ బస చేసి శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌస్, మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి తిరిగి హైదరాబాద్‌కు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.