30-10-2025 01:52:44 AM
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి) : పరిశ్రమల ఏర్పాటు తెలంగాణలో ఉన్న అనువైన ఎకో సిస్టం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టాలెంట్ పూల్, పటిష్ఠమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వంపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి గొప్ప నిదర్శనమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ పరిణామం తమ ప్రభుత్వ పనితీరుకు సజీవ సాక్ష్యమని చెప్పారు.
అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం ‘మెక్ డొనాల్డ్స్’ 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన ‘గ్లోబల్ ఆఫీస్’ను బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమెరికాకు వెలుపల అతి పెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ‘మెక్ డొనాల్డ్స్’ గ్లోబల్ లీడర్‌షిప్‌నకు ధన్యవాదాలు తెలిపారు.
‘మెక్ డొనాల్డ్స్’ అంటే గ్లోబలైజేషన్‌కు నిలువెత్తు నిదర్శనమని, ముందు చూపుతో 1991లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు అమలు చేసిన ఎల్పీజీ సంస్కరణల వల్ల ‘మెక్ డొనాల్డ్స్’ లాంటి ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు మన దేశంలోకి అడుగు పెట్టాయని, ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించి మన ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యమయ్యాయని గుర్తు చేశారు. హైదరాబాద్ ‘గ్లోబల్ జీసీసీ’ హబ్ యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందన్నారు.
ఇక్కడ కేవలం టెక్నాలజీకి సంబంధించిన జీసీసీలు మాత్రమే ఏర్పాటు కావడం లేదని, అన్ని రంగాలకు చెందిన జీసీసీలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థలు ‘తెలంగాణ’ వైపు చూస్తున్నాయని స్పష్టం చేశారు. హాస్పిటాలిటీ రంగ దిగ్గజ సంస్థ ‘మారియట్’ తన మొదటి జీసీసీని ప్రారంభించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుందన్నారు. ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనకు తమ ప్రభుత్వం ‘మెక్ డొనాల్డ్స్’ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో కలిసి పని చేసేందుకు ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు.