24-08-2025 06:23:45 PM
కుభీర్ ఎస్సై ఏ. కృష్ణారెడ్డి
కుభీర్: గ్రామాలలో పండుగల నిర్వహణతో శాంతియుత వాతావరణం నెలకొనాలని కుభీర్ ఎస్సై ఏ. కృష్ణారెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (బీ) గ్రామంలో అన్ని మతాల పెద్దలు, గణేష్ మండళ్ల నిర్వాహకులు, గ్రామస్తులు, నాయకులతో శాంతి సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఉత్సవ కమిటీ ద్వారా పోలీసుల అనుమతి తప్పకుండా తీసుకోవాలన్నారు. రోడ్డుకు అడ్డంగా మండపాలను ఏర్పాటు చేయవద్దని సూచించారు. అన్యమతస్తులకు ఎలాంటి అవరోధం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
వినాయక మండపాలలో యువకులు భక్తిశ్రద్ధలతో వినాయకుని పూజించి మండపాల వద్ద ఉండాలన్నారు. మండపాల్లో విగ్రహాలను ప్రతిష్టించి విగ్రహాల వద్ద ఎవరు లేకుండా పోవడం దురదృష్టకరమన్నారు. నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి అల్లర్లకు చోటు ఇవ్వకుండా ప్రశాంత వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలని కోరారు. భక్తిశ్రద్ధలతో పండుగలు నిర్వహించుకోవడం ద్వారా గ్రామాలలో సుఖశాంతులు నెలకొంటాయని ఈ దిశగా గ్రామంలోని యువత కృషి చేయాలని కోరారు.