31-01-2026 01:20:04 AM
అమరావతి, జనవరి 30: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న కేసులో సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, కోట్ల మంది హిందూ మనోభావా లు దెబ్బతీశారని తిరు మల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన తిరుమలలో మీడి యా సమావేశంలో మాట్లాడారు. సామ ర్థ్యం లేని డెయిరీకి 60 లక్షల కేజీల నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చి.. రూ. 250 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
చుక్క పాలు లేకుండానే లక్షల కిలోల నెయ్యి ఎలా వచ్చిందని టీటీడీ చైర్మన్ ప్రశ్నించా రు. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందని.. సిట్ నివేదికలో కూడా ఇదే ఉందన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహా ఆ పార్టీ నాయకులు హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ హయాంలో కల్తీ నెయ్యితో తిరుమలలో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని, తిరుమల లడ్డూలో ప్రమాదకర రసాయానాలు వాడారని బీఆర్ నాయుడు ఆరోపించారు.
నెయ్యిలో జంతువుల కొవ్వులు కలవలేదని సీబీఐ ఛార్జీషిట్‌లో ఎక్కడా చెప్పలేదన్నారు. స్వామివారి లడ్డూల తయారీలో ప్రాణాంతక రసాయనాలు వాడారని ఆయన ఆరోపించారు. నెయ్యిలో నూటికి నూరు శాతం కల్తీ జరిగిందని పేర్కొన్నారు. కల్తీ నెయ్యి అక్రమాల వెనుక ఉన్న వారి పేర్లు సీబీఐ బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాకపోతే కల్తీ నెయ్యి దందా ఇప్పటికే కొనసాగేదన్నారు. గత పాలకమండలిలో అనేక అవకతవకలు జరిగాయని, నిబంధనలు ఏమాత్రం పాటించలేదని టీటీడీ చైర్మన్ ఆరోపించారు.
ఎన్నో అరాచకాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. ఒకరిద్దరికి లాభం చేకూర్చడం కోసం నిబంధనలు మార్చారని తెలిపారు. గత పాలకమండలి చేసిన ఒత్తిళ్లకు సంబంధించిన ఈ-మెయిళ్లు కూడా సిట్ నివేదికలో పెట్టారని తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి దంపతులు సీబీఐకి బ్యాంక్ ఖాతాలు ఇచ్చేందుకు నిరాకరించారని.. పథకం ప్రకారమే తిరుమల ప్రతిష్ఠను దిగజార్చారని ఆయన మండిపడ్డారు.
కల్తీ నెయ్యి అంటే ఒకరకంగా స్లో పాయిజన్ అని చెప్పారు. కాసులకు కక్కుర్తి పడి భోలే బాబా డెయిరీని ఎంచుకున్నారని, గత టీటీడీ చైర్మన్, ముఠా మేస్త్రి సహకారం లేకుండా ఇవన్నీ చేయగలరా అని బీఆర్ నాయుడు ప్రశ్నించారు. తనిఖీల్లో భోలేబాబా డెయిరీకి ఒక్క ఆవు కూడా లేదని తేల్చారని బీఆర్ నాయుడు తెలిపారు.