calender_icon.png 16 September, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయుధ పోరులో లంబాడీ తండా

16-09-2025 12:57:29 AM

  1. రజాకార్లకు చిక్కకుండా.. కమ్యూనిస్టులకు షెల్టర్ జోన్

ఎందరో మంది విప్లవకారులకు ఆశ్రయమిచ్చిన ఊరు..

బెల్లంపల్లి, సెప్టెంబర్ 15: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎంతో మంది సాయుధ పోరాట యోధులు బెల్లంపల్లి ప్రాంతం నుంచి తమ కార్యాచరణను అమ లు చేశారు. పీడిత రైతాంగ ప్రజల హక్కుల కోసం తమ ప్రాణాలను సైతం త్రుణప్రాయంగా వదిలేశారు.

అంతటి సాయుధ పోరాట పటిమను చాటిన బెల్లంపల్లి ప్రాం తం విప్లవ బిడ్డలను తన పొత్తిళ్లలో దాచి కాపాడుకున్నది. బెల్లంపల్లి మండలంలోని లంబాడీ తండా గ్రామం రజాకార్ల జమానాలో ఎందరో మంది విప్లవకారులకు ఆశ్రయమిచ్చింది.

స్వాతంత్ర పోరాటం అనంతరం తెలంగాణ రైతాంగ పోరాటంలో పశువులు బాసిన విప్లవ యోధులను స్వతంత్ర సమరయోధులుగా గుర్తించిన ప్రభుత్వం వారిని కంటికి రెప్పలాr కాపాడుకున్న గ్రామాల పట్ల మాత్రం నిర్లక్ష్యం చూపుతుంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల నేపథ్యంలో ’ విజయక్రాంతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. 

లంబాడితండ గ్రామ ప్రత్యేకత...

రజాకార్ల జమానాలో దౌష్టీకాలు, దౌర్జన్యాలు విచ్చలవిడిగా జరుగుతున్న రోజుల్లో సాయుధ కమ్యూనిస్టు నాయకులకు లంబాడితండ గ్రామస్తులు అండగా నిలిచి తమ ఇళ్లలో ఆశ్రయాన్ని కల్పించారు. అప్పట్లో ఈ గ్రామం నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరు సాగిస్తున్న కమ్యూనిస్టు నాయకులందరికీ షెల్టర్ జోన్‌గా ఉండేది. బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన కమ్యూనిస్టు అగ్ర నేతలు పోతుగంటి పోశెట్టి, బాశెట్టి గంగారం, జె .కుమారస్వామి లు అనేకసార్లు ఈ గ్రామంలో షెల్టర్ పొందారు.

తూర్పు ప్రాంతంలోని ఉట్నూర్, లక్షెట్టిపేట, జన్నా రం, సిర్పూర్, ఇప్పటి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రాంతాలలో భూస్వాములు, దొరల ఆగడాలు విపరీతంగా ఉండేవి. ఆ సమయం లో దొరల గడీలపై దాడి చేసి రజాకార్లకు (నైజాం పోలీసులకు) దొరక్కుండా సాయు ధ కమ్యూనిస్టులు బెల్లంపల్లి ప్రాంతంలోని లంబడితండ గ్రామానికి చేరుకొని షెల్టర్ పొందేవారు.

ఈ గ్రామ ప్రజలు రజాకార్ల కదలికలను పసిగట్టి కమ్యూనిస్టు నాయకులకు చేరవేసేవారు. గ్రామస్థుల సహకారం తో అనేకసార్లు రజాకార్లకు చిక్కకుండా సాయుధ కమ్యూనిస్టులు తప్పించుకున్నా రు. గెరిల్లా తరహా యుద్ద తంత్రాలు పారితేరిన కమ్యూనిస్టులకు ఇక్కడి గ్రామస్తులు కొరియర్లుగా సహకరించేవారు.

మెరుపుదాడులే కీలకం

బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన కమ్యూనిస్టు నాయకులు బాసెట్టి గంగారం సారధ్యంలో సాయుధులైన కమ్యూనిస్టులు భూస్వాముల ఇళ్లపై మెరుపు దాడులు చేసేవారు. ఈ క్రమంలో జిల్లాలోని తిర్యాణి, ఆసిఫాబాద్ అటవీ ప్రాంతాల్లో రహస్య స్థావ రాలను ఏర్పాటు చేసుకొని ఈ దాడులకు పాల్పడేవారు. భూస్వాముల ఇళ్లలో నిలువ ఉంచిన ధాన్యాన్ని తీసుకెళ్లి అడవి బిడ్డలకు పంచిపెట్టేవా రు.

దీంతో కమ్యూనిస్టు నాయ కులు పేద గిరిజనులకు దగ్గరయ్యేవారు. ఉట్నూర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లోని అటవీ భూములను నరి కి గిరిజనులకు వ్యవసాయ భూముల ను పంచిపెట్టారు. ప్రస్తుతం ఉట్నూర్ ప్రాంతంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములన్ని అప్పటి బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన సాయుధ కమ్యూనిస్టు నాయకులు పంచినవనే ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు చెబుతారు.