07-05-2025 12:00:00 AM
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల, మే 6 (విజయక్రాంతి) : వేములవాడ పట్టణంలోని మూలవాగు నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణ, భూ సేకరణ పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో 80 ఫీట్ల రోడ్డుకు మార్కింగ్ చేయడంతో పాటు, 350 కుటుంబాలకు నష్టపరిహారం కింద గజానికి 30 వేల రూపాయలు ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అభివృద్దిని అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో 50 ఏండ్లుగా రోడ్ల విస్తరణ పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు.
ఈసారి కచ్చితంగా 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు కొనసాగిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. నష్టపరిహారం కింద 47 కోట్ల 80 లక్షల రూపాయలు కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయని వెల్లడించారు. నిర్వాసితులందరికీ ప్రభుత్వం నష్ట పరిహారం అందజేస్తుందని తెలిపారు. వేములవాడ ఆలయం వద్ద రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, వీటికి అవసరమైన భూసేకరణ చేసేందుకు తొలగించాల్సిన సర్వే చేసి త్వరగా అందించాలని సూచించారు.
విధుల్లో అలసత్వం వహించిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. 315 ఇండ్ల నిర్మాణాల ప్రతిపాదనలను 4 టీం ల ఇంజనీరింగ్ అధికారుల ద్వారా ఇప్పటి వరకు 257 ఇండ్లకు సంబంధించిన సర్వే పూర్తి చేసినట్లు, మిగిలినవి వీలైనంత త్వరగా అందిస్తామని అధికారులు తెలిపారు.
భూ సేకరణ చట్టం 2013 సెక్షన్ 12 ప్రకారం భూసేకరణ నిమిత్తం సర్వే చేసే పూర్తి అధికారాలు తమకు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. చట్టంపై అధికారులు అవగాహన పెంచుకొని వారంలో మొత్తం భూ సేకరణ సర్వే పొరపాట్లు జరగకుండా పూర్తి చేసి ప్రతిపాదనలు అందిస్తే వెంటనే అవార్డులు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి, మున్సిపల్, ఆర్ అండ్ బి, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.