27-08-2025 12:27:21 AM
జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 26 : సబ్ రిజిస్టర్ ఆఫీస్ తరలింపు నిర్ణయం ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుందని జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంచిరెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ ప్రజలకు 1969 జూన్ నుండి అందుబాటులో ఉన్న ‘సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మహేశ్వరం నియోజకవర్గంలోని మంఖాల్ కు తరలించే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం సరికాదన్నారు.
ప్రజల వద్దకే పాలన తీసుకొస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయంలో నిర్మాణం మొదలుపెట్టిన భవనాన్ని పూర్తి చేయకుండా ఉన్న కార్యాలయాలను నియోజకవర్గం నుండి తరలిస్తే నియోజకవర్గ అభివృద్ధి ఆగిపోవడమే కాకుండా ఉపాధి అవకాశాలు కోల్పోతామని కలెక్టర్ కి సవివరంగా తెలిపి ఈ నిర్ణయాన్ని తక్షణమే ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.