calender_icon.png 27 August, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎం దర్తి ఆభాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ పటిష్టంగా అమలు చేయాలి

26-08-2025 11:32:21 PM

అధికారులను ఆదేశించిన కలెక్టర్ 

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఏజెన్సీ ఏరియాలోని మారుమూల దట్టమైన అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులకు పీఎం ధర్తీ ఆభాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ పథకంలో భాగంగా గిరిజనులను చైతన్యపరిచి వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం  జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఇతర అధికారులతో పీఎం ధర్తీ ఆభాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి తీసుకోవలసిన కార్యాచరణ పై వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి

అధికారుల చేత పిఎం ధర్తీ ఆభాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ కి సంబంధించిన ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ఏరియా పరిధిలోని మారుమూల గ్రామాలు ఎక్కువగా ఉన్న 19 మండలాలలోని 134 గ్రామాలలో పిఎం ధర్తీ ఆభాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ పథకం పగడ్బందీగా అమలు చేయడానికి జిల్లా స్థాయి అధికారులకు హైదరాబాదులోని నిమ్స్ మిక్ (ఎన్ ఐ ఎన్ ఎస్ ఎం ఈ) కేంద్రంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం అందించడం జరిగిందన్నారు.

జిల్లా స్థాయి కమిటీ సభ్యులు మండల స్థాయిలో బ్లాకుల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి వారికి శిక్షణ అందించి ఆ గ్రామాలలోని ప్రజలకు వారికి కావలసిన మౌలిక వసతుల గురించి అవగాహన కల్పించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. ముఖ్యంగా ఆ గ్రామాలలోని గిరిజనులకు విద్య, వైద్యం, రూరల్ డెవలప్మెంట్, ఐ సి డి ఎస్, ఫారెస్ట్, జల్ జీవన్ మిషన్, గిరిజన సంక్షేమ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా గ్రామాలలో చేపట్టవలసిన మౌలిక వసతులపై ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ప్రజలందరికీ ఆ శాఖల ద్వారా వారు లబ్ధి పొందేలా చూడాలని అన్నారు.

మండలం లెవెల్ కమిటీ సభ్యులు ఇంటింటికి తిరిగి గిరిజనులకు ఈ పథకాల గురించి అవగాహన కల్పించి ఆ గ్రామంలోని పెద్దలను గిరిజనులను ఒకచోట చేర్చి గ్రామసభలో ఆ గిరిజనులకు కావలసిన మౌలిక వసతులు ముఖ్యంగా విద్యా వైద్యం, మంచినీటి సౌకర్యం, కరెంటు, గ్రామంలోని రోడ్లు, అటవీ శాఖ సంబంధించిన పోడు పట్టాలు, గిరిజన సంక్షేమ శాఖ, రూరల్ డెవలప్మెంట్ ద్వారా వారికి కావలసిన సంక్షేమ పథకాలు,గిరిజన రైతులకు జల్ జీవన్ మిషన్ ద్వారా కావలసిన సదుపాయాలు ఇతర పథకాల గురించి వారికి అవగాహన కలిగించాలని అన్నారు. ప్రతి శాఖల అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్కువ శాతం గిరిజనులకు అన్ని రకాల సౌకర్యాలు కలిగేలా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు.