07-05-2025 12:07:30 AM
అధికారులకు ఆదేశించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, మే 6 (విజయక్రాంతి): భూ భారతి చట్టం ప్రకారం భూ సర్వే చేసి పూర్తి వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నల్లమడుగు, ముంబాజీపేట గ్రామంలో భూ భారతి సర్వే టీమ్ లు క్షేత్ర పర్యటన చేసి సర్వే భూ వివరాలు, పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న వాటి వివరాలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ భారతి చట్టం ప్రకారం సాగు చేస్తున్న భూముల వివరాలు, ఎన్ని సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారు, సర్వే నెంబర్, భూ విస్తీర్ణం, సాగు చేస్తున్న రైతుల సంఖ్య, తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతమా లేక పట్టా భూమా అనే వివరాలు అటవీ శాఖ అధికారులు, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేయాలని సూచించారు.
ఏళ్ల తరబడి సాగుచేస్తున్న భూ వివరాలను సంబంధిత రైతులను అడిగితెలుసుకున్నారు. చట్టం ప్రకారం భూముల వివరాలు సేకరించి ఎలాంటి సమస్యలకు తావులేనట్లయితే పట్టా లకు సిఫారసు చేయాలని సూచించారు.
అనంతరం లింగంపేట్ మండలం భవానీపేట్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను కలెక్టర్ సందర్శించి, కొనుగోళ్ల వివరాలు, రైతుల వివరాలు, కేంద్రాల్లో వసతుల వివరాలు అడిగితెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, భూ భారతి ప్రత్యేక అధికారి రాజేందర్, రెవిన్యూ, పౌరసరఫరాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.