24-11-2025 12:03:21 AM
-టిమ్స్, పోలీస్ స్టేషన్ నిర్మాణానికి సహకరించాలి
-జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను స్లాబులను సవరించాలి
-మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, నవంబర్ 23 : కొత్తపేటలో నిర్మిస్తున్న టిమ్స్ దవాఖాన నిర్మాణానికి సహకరించాలని, ఇక్కడ చైతన్యపురి పోలీస్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఇచ్చిన భూములను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆదివారం సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ ను మొదటగా కోహెడ, అనంతరం బాటసింగారం గ్రామానికి తరలించినట్లు చెప్పారు.
కొత్తపేటలో ఉన్న ప్రభుత్వ స్థలంలో 28 అంతస్తులతో (టీమ్స్) మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించడానికి అప్పటి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారని గుర్తు చేశారు. అయితే, హాస్పిటల్ నిర్మాణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం 14 అంతస్తులకు పరిమితి చేయడంతోపాటు పోలీస్ స్టేషన్, పార్క్, విద్యుత్ సబ్ స్టేషన్ కోసం ఇచ్చిన భూమిని రద్దు చేశారని తెలిపారు.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భూముల రద్దును వెనక్కి తీసుకోవాలని మంత్రిని కోరారు. అలాగే, జీహెచ్‌ఏంసీ ఆస్తిపన్ను స్లాబ్ లను మార్చాలని కోరారు. అనంతరం మంత్రి స్పందించి, టీమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో భూముల రద్దు వివరా లపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు.
జీహెచ్‌ఏంసీ పన్నుల విషయంలో అధికారులతో చర్చించి ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, సామ తిరుమల రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, జిన్నారం విఠల్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు తోట మహేష్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, టంగుటూరి నాగరాజు, జక్కిడి రఘువీర్ రెడ్డి, నాగలక్ష్మి, యాదగిరి ముదిరాజ్, జయశ్రీ, గట్టు శ్రీను, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.