calender_icon.png 24 November, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు

24-11-2025 12:02:13 AM

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

జగిత్యాల అర్బన్, నవంబర్ 23 (విజయ క్రాంతి): కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు, అవకాశం లభిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో నూతన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గాజంగి నందయ్య నియమితులైన సందర్భంగా ఏర్పాటుచేసిన అభినందన సభలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూఆలస్యం అయినా కాంగ్రెస్ పార్టీ కష్టపడిన కార్యకర్తను గుర్తించి అవకాశం కల్పిస్తుందని చెప్పడానికి ఉదాహరణ మొట్టమొదట తానే నని, రెండో ఉదాహరణ నందన్న అని అన్నారు. కార్యకర్తగా జిల్లా అధ్యక్షుడిగా మంత్రిగా పార్టీ గుర్తించి తనకు అవకాశం కల్పించిందన్నారు.

పెద్దలు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు లు తన భుజం తట్టి ముందుకు నడిపించారని, జీవన్ రెడ్డి 2018 లో లక్ష్మణ్ కుమార్ కి టికెట్ ఇవ్వకపోతే నాకు కూడా వద్దు నేను కూడా పోటీ చేయనని అధిష్టానానికి చెప్పిన మాటలు తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.ఇథనాల్ ఫ్యాక్టరీ సంబంధించి తనతో పాటు జీవన్ రెడ్డి కూడా పోరాటం చేశారని అన్నారు.ఆనాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా ప్రజల పక్షాన నిలబడి పోరాడితే పోలీస్ లు రోజుల తరపడి అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. కేటీఆర్, హరీష్ రావు సైడ్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు.

నేను జైల్లో జిమ్ చేస్తా.. సిక్స్ ప్యాక్ చేస్తా.. అన్నావు కదా పోయి జైల్లో సిక్స్ ప్యాక్ చేసుకో అని కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు.జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా బిఆర్‌ఎస్ నేతలకు బుద్దిరాలేదని అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందని ఆ దిశగా కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి కోరారు. డిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన గాజంగి నందయ్య ను మంత్రితో పాటు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.