calender_icon.png 8 September, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిస్టులతోనే భూపంపిణీ

08-09-2025 12:00:00 AM

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం

ఎల్బీనగర్, సెప్టెంబర్ 7 : దేశంలో పేదలకు భూపంపిణీ చేసింది కమ్యూనిస్టులని, బీజేపీతో ప్రజాస్వామ్యం ప్రమాదం ఉందని, ప్రజలందరూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడి దేశాన్ని కాపాడాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎంఈ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఆదివారం వీర తెలంగాణ సాయుధ పోరాటాలు- వక్రీకరణాలు అనే సదస్సు నిర్వహించారు.

సదస్సుకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.  బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలు పాలిస్తే,1946-51 మధ్యన నైజం సర్కార్ తెలంగాణ పాలించారని, దేశ సంపదను బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటే, తెలంగాణలో భూస్వాములు, పట్వా రీలు పాలకులుగా మారి దోచుకున్నారని గుర్తు చేశారు.

నైజాం సర్కార్ లో జనగాం ప్రాంతంలో రామచంద్రారెడ్డి అనే భూస్వామికి 1,50,000 ఎకరాల భూమి ఉండేదని, తెలంగాణ అంతటా వెట్టిచాకిరి ఉందని, భూస్వాములు, పెత్తందారులు, పట్వారీలకు లొంగి పనిచేయాల్సిన పరిస్థితి దాపురించేదని గుర్తు చేశారు. దుర్భర పరిస్థితి నుంచి ప్రజలను కాపాడేందుకు 1930లో ఆంధ్ర మహాసభ పేరుతో కమ్యూనిస్టు పార్టీ ప్రజల ముందుకు వచ్చిందన్నారు.

తెలంగాణలో భూస్వాములు, పట్వారీలు, రజాకారులకు వ్యతిరేకంగా సీపీఎం పార్టీ సాయుధ రైతాంగ పోరాటం చేసిందన్నారు.  1946లో దొడ్డి కొమరయ్య సాయుధ తెలంగాణ పోరాటంలో తొలి అమరుడు అయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు పేదలకు 10,000 ఎకరాల భూములు పంచి పెట్టారని, ఆ పోరాటంలో 4,000 మంది కమ్యూనిస్టులు మరణించారని తెలిపారు.

సాయుధ తెలంగాణ పోరాటాన్ని హిందూ, ముస్లిం పోరాటంగా బీజేపీ వక్రీకరించడం  సిగ్గుచేన్నారు. బీహార్ లో 65 లక్షల ఓటర్ల  పేర్లు తొలగించారని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, బీజేపీ ఆటలు సాగకుండా ప్రతి ఒక్కరూ ఓటు రూపం లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.  బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. 

సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య,  జిల్లా కార్యవర్గ సభ్యుడు చంద్రమోహన్, జిల్లా కమిటీ సభ్యులు కీసర నర్సిరెడ్డి, ఎల్బీనగర్ సర్కిల్ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య, సరూర్ నగర్ సర్కిల్ కార్యదర్శి సీహెచ్ వెంకన్న, నాయకులు వీరయ్య, శ్రీనివాస్, యాదిరెడ్డి, మల్లేశం, కృష్ణయ్య, గణేష్, సంధ్య, రామస్వామి, భాస్కర్, అనిల్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.