29-11-2025 12:29:39 AM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్: నవంబర్ 28 (విజయక్రాంతి): పంచాయితీ ఎన్నికలను ప్రశాం త వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి ఎం.పి .డి.ఓ లు, తహసిల్దార్ లతో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సం స్థల ఎన్నికలు మూడు దశలలో నిర్వహించడం జరుగుతుందని, మొదటి విడతలో గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, నెల్లికుదురు, మహబూబాబాద్ మండలాల్లోని 15 5 గ్రామపంచాయతీ సర్పంచ్, 1338 వార్డు సభ్యుల ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం డిసెంబర్ 11 గురువారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు.
2.9.2025 ఫోటో ఎలాక్టోరల్ రోల్ ప్రకారం జిల్లాలోని 18 మండలాల్లో మొత్తం 5,56,780 మంది ఓటర్లు ఉండగా 2,73,692 పురుషులు, 2,83,064 మహిళ లు, 24 ట్రాన్స్జెండార్స్ ఉన్నారన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కగా అమలయ్యే లా నోడల్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. 4,932 బ్యాలెట్ బాక్స్ లను అందు బాటులో ఉంచినట్లు తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వారిగా పోలింగ్ మెటీరియల్ కిట్లుపంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణకు 1,818 పిఓలు,2,580 ఓపిఓ లను నియమించినట్లు తెలిపారు.మొదటి, రెండవ, మూడవ విడతల్లో పోలింగ్ జరిగే పోలింగ్ స్టేషన్లలో సమస్యాత్మకమైన గ్రామ పంచాయతీల్లోని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ తో పాటు మైక్రో అబ్జార్వర్లను నియమిస్తున్నట్లు తెలిపారు.ప్రతి మండలంలో క్లస్టర్ లను ఏర్పాటు చేశామని, నామినేషన్ దాఖలాలు చేసే అభ్యర్థులు వారి క్లస్టర్ లో సూచించిన గ్రామ పంచాయతీలలో నామినేషన్ సమర్పించవచ్చని పేర్కొన్నారు.
అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను పరిశీలించడానికి వ్యయ పరిశీలకులను కూడా సిద్ధం చేశామని, సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులు 5 వేల జనాభాకు పైగా ఉన్న గ్రామాలలో సర్పంచ్ అభ్యర్ధి 2 లక్షల 50 వేల రూపాయల వరకు, వార్డ్ సభ్యులకు 50 వేల రూపాయలు, 5వేల జనాభా తక్కువగా ఉన్న గ్రామాలలో ఒక లక్ష 50 వేల రూపాయలు, వార్డ్ సభ్యులు 30 వేల వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. 24 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, జిల్లా సరిహద్దుల్లో 7 ఎస్‌ఓటి బృందాలను నియమించినట్లు తెలిపారు.
అభ్యర్థులకు ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా కేంద్రంలో , స్థానిక ఎంపీడీవో కార్యాలయాలలో హెల్ప్ లైన్ డెస్క్ లను ఏర్పాటు చేశామని వీటి ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, ఎన్నికల నోడల్ అధికారులు జెడ్పిసిఓ పురుషోత్తం, డిపిఓ హరిప్రసాద్, సిపిఓ శ్రీనివాస్, తొర్రూర్ ఆర్డీవో గణేష్, డిఇఓ దక్షిణామూర్తి, పిడి హౌసింగ్ హనుమానాయక్, డివిజనల్ పంచాయతీ అధికారులు స్వరూప, పుల్లారావు, మాస్టర్ ట్రైనర్స్ పాల్గొన్నారు.