25-07-2025 12:00:00 AM
సిద్దిపేట, జూలై 24 (విజయక్రాంతి): నంగునూరు మండలంలో అధికారులపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారంటూ సిద్దిపేట కలెక్టర్ హైమావతి గురువారం మండలంలో పర్యటించిన ఆమె నాయకులతో ప్రస్తావించారు. కాంగ్రెస్ మండల నాయకుల తీరును కలెక్టర్ వివరిస్తూ ఇది సరైన విధానం కాదంటూ సూచించారు. నాయకుల చర్యల వల్ల నంగునూరు మండలంలో పని చేయడానికి అధికారులు ఆసక్తి చూపడం లేదని కలెక్టర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కొంతకాలంగా నంగునూరు మండలంలో అధికారుల బదిలీలు, పనుల కేటాయింపులు, పథకాల అమలు విషయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకుంటు న్నారని, వారి వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని తెలిసిందన్నారు. ఈ ఒత్తిళ్ల కారణంగా అధికారులు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ విధులను నిర్వర్తించలేకపోతున్నారని, దీని వల్ల అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగుతున్నాయని కలెక్టర్ వివరించారు.
రాజకీయ పార్టీల నాయకులు తమ పరిధి దాటి అధికారుల పనిలో జోక్యం చేసుకోవడం సరికాదని గట్టిగా హెచ్చరించారు. నాయకులు ప్రజలకు సేవ చేయడమే వారి బాధ్యత అని, అధికారులను తమకు అనుకూలంగా వాడుకోవాలని చూడటం అప్రజాస్వామిక మన్నారు. అధికారులు స్వతంత్రంగా, నిబంధనలకు లోబడి పనిచేయడానికి వీలు కల్పించాలని, లేకపోతే మండల అభివృద్ధి కుంటుపడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.