calender_icon.png 8 September, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత కళకు చేయూతనిద్దాం

07-08-2024 12:00:00 AM

దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధికోసం చేనేత పరి శ్రమ పాముఖ్యత గురించి విస్తృ త అవగాహన కల్పించే లక్ష్యంతో భారత ప్రభు త్వం ఆగస్టు 7ను ‘జాతీయ చేనేత దినోత్సవం’గా ప్రకటించింది. 2015లో ఇదే రోజున మద్రాసు విశ్వవిద్యాలయం సెంటినరీ హాల్‌లో ప్రధా ని నరేంద్ర మోడీ ‘తొలి జాతీ య చేనేత దినోత్సవాన్ని’ ప్రారంభించారు.

బ్రిటిష్ ప్రభు త్వం బెంగాల్ విభజనకు నిరసనగా కలకత్తా టౌన్ హాల్‌లో 1905లో ఇవాళ్టి దినాన ప్రారంభించిన ‘స్వదేశీ ఉద్యమం’ స్ఫూర్తిగా దేశీయ ఉత్పత్తులను పునరుద్ధరించుకోవడానికి అందరం నడుం బిగిద్దాం. చేనేత రంగం సుమారు 63.7 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో రెండవ అతిపెద్ద ఉపాధి మార్గం ఇదే.

ప్రపంచంలో చేతితో నేసిన బట్టలు 95 శాతం భారతదేశం నుండి ఎగుమతి అవుతున్నాయి. ఇది దేశీయ చేనేత కళాకారుల గొప్పతనానికి అద్దం పడుతున్నది. చేనేత వస్త్రాలు మానవాళి ప్రాథమిక అవసరాలను ఎంతో చక్కగా తీరుస్తాయి. ఎగుమతులకు అవకాశం ఉంది కాబట్టే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. “చేనేత నేతకళ కనుమరుగయ్యే స్థితిలో ఉంది.

మిల్లు పరిశ్రమల  భవిష్యత్తు ఏమైనప్పటికీ చేనేత వస్త్రాలు నశించి పోకూడదు. దానికి ప్రభుత్వాలు బాధ్యత వహించాలి” అని మహాత్మాగాంధీ ఆనాడే అభిప్రాయపడ్డారు. అగ్గిపెట్టెలో సైతం పట్టేంతటి పలుచని చీరలను నేసిన అద్భుత నేతన్నలు ఎందరో మనకు ఉన్నారు. చింతకింది మల్లేశం, పిట్ట రాములు ప్రభృతులు నేత కార్మికులు ఎందరికో మార్గదర్శకులు. కానీ, నేడు నేతన్నల పరిస్థితి కడు దయనీయంగా మారింది. 

ప్రత్యేక కార్పొరేషనే పరిష్కారం

వృత్తిపై భరోసా లేక, వేరే పని చేయలేక, రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితిలో అనేకమందికి కుటుంబ పోషణ భారమవుతున్నది. వందల సంఖ్యలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. 2010 నుంచి సుమారు 2,000 మంది నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డట్టు గణాంకాలు చెబుతున్నాయి.

చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, చేనేత ముడిసరుకుపై 50 శాతం సబ్సిడీతో కార్మికులకు నేరుగా సరఫరా చేయాలని జాతీయ, రాష్ట్ర పద్మశాలి సంఘం, చేనేత కార్మిక సంఘాల ఐక్యవేదికల నాయకులు పలువురు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు తక్షణం హ్యాండ్లూమ్, పవర్‌లూమ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.

దానికి రూ. 5,000 కోట్ల నిధులు కేటాయించాలని, రైతు బీమా మాదిరిగా చేనేత బీమా అమలు చేయాలని వారు కోరుతున్నారు. ‘త్రిప్ట్ ఫండ్ స్కీమ్’ను యధావిధిగా కొనసాగించాలని, సహకార సంఘాలకు ఎన్నికలు జరిపి కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నేత కార్మికులను ఉపాధి హామీ పథకంలో చేర్చాలని, ఈ వస్త్రాలపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని వారు కోరుతున్నారు.

షాపింగ్ మాల్స్ కారణంగా చేనేత వస్త్రాలను ఎవరూ కొనే పరిస్థితి లేదు. కాబట్టి, ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాలు, గురుకులాలకు సరఫరా చేయాలి. బతుకమ్మ పండుగ, ఇతర పర్వదినాలకు పెద్ద మొత్తంలో నేతన్నలకు ఆర్డర్లు ఇచ్చి ఆదుకోగలగాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని వివిధ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు వారంలో ఒకరోజు తప్పనిసరిగా చేనేత వస్త్రాలను ధరించేలా సూచనలు జారీ చేయాలి. 

 కామిడి సతీష్ రెడ్డి