07-08-2024 12:00:00 AM
పాలకుర్తి రామమూర్తి :
మనసా చింతితం కార్యం
వాచా నైవ ప్రకాశయేత్
మంత్రేణ రక్షయేత్ గూఢం
కార్యే చాపి నియోజయేత్
చాణక్య నీతి: 2-7
మనసులో ఏ కార్యాన్ని అయితే ఆలోచిస్తామో ఆ ఆలోచనలను ఎవరి దగ్గరా ప్రస్తావించవద్దు. ఆ ఆలోచనలను మంత్ర సమానంగా భావిస్తూ వ్యూహాత్మకంగా, రహస్యంగా కాపాడాలి. ఎందు కంటే, ఆలోచనలకు కార్య రూపాన్నిచ్చేప్పుడు ఎవరైనా అవరోధాలు కల్పించ వచ్చు. కార్యసాఫల్యత జరగక పోతే అపహాస్యం చేయవచ్చు.
అంతేకాదు, ఆలోచ నలను అమలు చేసి ఫలితాన్ని సాధించి చూపిన వేళ సమాజ మంతా అబ్బుర పడుతుంది. మన కూ తగిన గుర్తింపు వస్తుంది. కార్యభం గం కాదు. కాబట్టి, ‘ఆలోచనలను విశ్లేషణ చేసుకొని కార్యనిర్వహణా ప్రణాళి కను రచించుకొని దాని ప్రకా రం ముందుకు సాగడం ఉత్తమం’ అని చాణక్య నీతి చెపుతున్నది.
ఏ పనినైతే సాధించాలని, సాధించగలనని బలంగా విశ్వసిస్తామో దానికి సంబంధించిన సూచనలను మనసుకు బలంగా ఇచ్చుకోవడం, ఆ సూచనలతో బలోపేతమైన మదిని కార్యోన్ముఖం చేయడం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది. ఎంత గోప్యం గా ఆ ఆలోచనలను పెంచుకోగలిగితే అంత త్వరగా కార్య సఫలత కలుగుతుంది.
నాయకుడు తాను సంకల్పించిన కార్యం వెల్లడించేందుకు సరైన సమయం కోసం ఎదురుచూడాలి. ప్రతీ కార్య సాఫల్యతా మూడు ముఖ్యమైన భూమికల గుండా పయనిస్తుంది. మొదటిది: ఆలోచన, ప్రణాళికల భూమిక. రెండవది: ఆ ప్రణాళికలను అమలు చేసే భూమిక. మూడవది: విపణిలో దానిని పంపి ణీ చేసే భూమిక.
ఈ మూడు భూమికలలో ఎక్కడ రహ స్యం వెళ్ళడైనా, పోటీదారులు దానికి అవరోధాలు కల్పించవచ్చు. ఆ ప్రణాళిక అమలులో ముఖ్యమైన వ్యక్తిని ప్రలో భాలకు గురి చేసి నాయకుని నిస్సహాయుని చేయవచ్చు. విపణి లో ఆ ఉత్పత్తిపై నకార ప్రచారమూ చేయవచ్చు. కాబట్టి, కార్యం పూర్తయ్యే వరకు రహస్యాలను భద్రంగా దాచిపెట్టాలని అంటాడు చాణక్యుడు.
అసలుకే మోసం
ఒక సమావేశ మందిరంలో పెట్టుబడులకు సంబంధించిన ఒక సదస్సు జరుగుతున్నది. అందులో ఆర్థిక యోజ నా, ప్రణాళికా రంగంలో నిష్ణాతురాలు, చాలా చురుకైన, సౌందర్యవతియైన ఒక అమ్మాయి పాల్గొన్నది. క్రియాశీలకంగా ప్రవర్తిస్తూ, అందరినీ ఆకట్టుకుం టున్న ఆమెను ఒక యువకుడు చూశాడు. మొదటిచూపులోనే ఆమెను ప్రేమించాడు.
ఆమె అందానికి మోహితుడైన అతడు ఆమెవద్దకు వెళ్ళి “నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు సమ్మతమైతే పెళ్ళి చేసుకుంటాను” అంటాడు. ఆమె నీ ఆర్థిక స్థితిగతులు, కుటుంబ పూర్వాపరాలను గురించి చెప్పమని ఆ అబ్బాయిని అడుగుతుంది.
ఆ యువకుడంటాడు, “ఇప్పుడు నేను తండ్రిచాటు బిడ్డడినే, సామాన్యుడినే. కానీ, కొన్ని నెలల తర్వాత కోటీశ్వరుడిని అవుతాను” అం టాడు. “ఎలా?” అడుగుతుందా అమ్మా యి. అతనంటాడు, “నా తండ్రి జబ్బు తో ఉన్నా డు. బహుశా కొద్ది నెలలలో అతడు మరణిస్తాడు. తదుపరి దాదాపు రూ. 300 కోట్ల నాన్న ఆస్తి మొత్తానికి నేనే అధిపతిని అవుతాను” అంటాడు.
ఆ మాటలకు ఆ అమ్మాయి ప్రభావితమవుతుంది. ఇరువురూ వారి అడ్ర సులు, ఫోన్ నంబర్లు మార్చుకుంటారు. రోజులు గడుస్తున్నాయి, ఆ అబ్బాయి ఊహలలో తేలిపోతున్నాడు. ఇలా ఉం డగా, చాలా కొద్దికాలంలోనే ఆ అమ్మా యి ఆ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది. కానీ, ఆ అబ్బాయికి భార్యగా కాదు, సవతి తల్లిగా. పెట్టుబడి మార్కెట్ రిస్క్‌పై ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలను, ప్రణాళికలను కార్యరూపం దాల్చక ముందే ఇతరులతో పంచుకుంటే ఫలితం తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది.