calender_icon.png 8 September, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హసీనా భవితవ్యం?

07-08-2024 12:00:00 AM

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ప్రస్తుతానికి భారత్‌లో సురక్షితంగా ఆశ్రయం పొందుతున్నారు.  బ్రిటన్‌లో రాజకీయ ఆశ్రయం పొందాలనుకున్న ఆమె ప్రయత్నాలకు ఆదిలోనే విఘాతం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాత్కాలిక రాజకీయ ఆశ్రయం కల్పించడానికి తమ చట్టాలు అనుమతించవని బ్రిటన్ విదేశాంగ శాఖ స్పష్టం చేయడంతో ఆ దేశం తలుపులు మూసుకున్నట్లయిం ది. లండన్‌లో ఉంటున్న తన సోదరి రెహానా వద్ద ఉండాలనేది హసీనా ఆలోచన. రెహానాకు బ్రిటీష్ పౌరసత్వం ఉండడంతో అక్కడ తనకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని ఆమె భావించారు.

ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో వేరే దేశం బహుశా ఫిన్లాండ్‌లో ఆశ్రయం కోసం ఆమె ప్రయత్నించవచ్చని తెలుస్తున్నది. ప్రధాని పదవినుంచి తప్పుకోవడం అనివార్యంగా మారిన సమయంలో భారత్ రావడానికి హసీనా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారని, అందుకు ప్రభుత్వం అనుమతించిందని మంగళవారం అఖిలపక్ష సమావేశంతోపాటు పార్లమెంటు ఉభయసభల్లో చేసిన ప్రకటనలో విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు.

అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు హసీనా వేరే దేశంలో ఆశ్రయం పొందేదాకా భారత ప్రభుత్వం ఆమెకు ఆశ్రయం కల్పిస్తుందా? అలాకాక మన దేశంలోనే శాశ్వతంగా రాజకీయ ఆశ్రయం కల్పిస్తుందా? అనే చర్చ జరుగుతున్నది. హసీనా కుటుంబంతో భారత్‌కు ఉన్న బలమైన అనుబంధం దృష్ట్యా ఆమెకు ప్రభుత్వం ఆశ్రయం కల్పించడంలో తప్పేమీ లేదు.

కానీ, ఆమెకు శాశ్వతంగా రాజకీయ ఆశ్రయం కల్పించడం వల్ల దౌత్యపరంగా ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హసీనా మన దేశంలో ఆశ్రయం పొందడం ఇది మొదటిసారి కాదు.

1975లో హసీనా తండ్రి, అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని ముజిబుర్ రెహమాన్, ఆయన కుటుంబానికి చెందిన 18 మందిని దుండగులు దారుణంగా హత్య చేసినప్పుడు కూడా ఆమెతోపాటు ఆమె సోదరి రెహనాకు అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఆశ్రయం కల్పించారు.

హసీనా, ఆమె సోదరి అప్పుడు దేశంలో లేకపోవడంతో వారిద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇందిర స్వయంగా వారిని భారత్‌కు ఆహ్వానించారు. ఆరేళ్లపాటు అంటే 1981లో హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లేదాకా వారు ఢిల్లీ శివార్లలో నివాసం ఉన్నారు. 

అయితే, అప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు ఎంతో తేడా ఉంది. హసీనా ప్రభుత్వంతో భారత్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో తీవ్రవాద కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేశారని, తద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో శాంతికి దోహదం చేశారన్న భావన మన పాలకులకు ముఖ్యంగా మోడీ ప్రభుత్వానికి ఉంది.

ఈ కారణంగానే బంగ్లాదేశ్‌తో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నీటి సమస్యలతోపాటు పలు సమస్యల పరిష్కారానికి మోడీ ప్రయత్నించారు. ఇక, వాణిజ్య పరంగానూ బంగ్లాదేశ్ భారత్‌కు ముఖ్య భాగస్వామి. భారతీయ కరెన్సీలో ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగించడానికి గతేడాదే ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. విదేశీ నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బంగ్లాకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం.

అంతేకాదు, పొరుగు దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉండాలన్నదే మోడీ ప్రభుత్వ విధానంగా ఉంది. పాక్‌తోపాటు నేపాల్, శ్రీలంక, మాల్దీవులతో భారత్‌కు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీర్ఘకాలంగా సఖ్యంగా ఉన్న బంగ్లాదేశ్‌తోనూ విరోధం కొనితెచ్చుకోవాలని కోరుకోదు.

అంతేకాక,  బంగ్లాదేశ్‌లో భవిష్యత్తులో భారత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడితే అది చైనాకు అనుకూలంగా మారవచ్చన్న భయాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ  ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో వివాదాలను మన దేశం కోరుకోదనేది దౌత్యవర్గాల భావన. అందుకే హసీనాకు శాశ్వత ఆశ్రయం కల్పించడానికి మన దేశం ఇష్టపడక పోవచ్చని తెలుస్తున్నది.