04-05-2024 01:55:50 AM
బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
పటాన్‌చెరు, మే 3: దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం ప్రధాని నరేంద్రమోదీతోనే సాధ్యమని, మెదక్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్‌పల్లి నుంచి జిన్నారం, గడ్డపోతారం మీదుగా గుమ్మడిదల వరకు జరిగిన రోడ్‌షో, బైక్ ర్యాలీలో రఘునందన్‌రావుతో కలిసి రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. సమస్యల పట్ల అవగాహన, వాటిని పరిష్కరించే నేర్పు రఘునందన్‌రావుకు ఉన్నాయని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని వెల్లడించారు. రఘునందన్‌రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఎంపీ అభ్యర్థుల ఎంపికలో కుల వివక్ష చూపారని ఆరోపించారు.
ఓడిపోయే ఎంపీ సీటును బీసీలకు ఇచ్చారని విమర్శించారు. మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌లో బీసీలు లేరా అని ప్రశ్నించారు. పక్క పార్టీల నుంచి అభ్యర్థులను తెచ్చుకొని నిలబెట్టారని ఆరోపించారు. సీఎం సిద్దిపేటకు వచ్చి తొడ కొడితే, తాను కొడంగల్ వెళ్లి తొడగొడతానని చెప్పారు. ‘మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం’ అని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. రఘునందన్‌రావు దుబ్బాకలో ఓడిపోయిండు అని అంటున్నడు రేవంత్.. ఆయన కొడంగల్‌లో ఓడిపోలేదా? అని ప్రశ్నించారు. తాను సొంత జిల్లా మెదక్‌లోనే ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. కానీ రేవంత్ కొడంగల్ నుంచి పారిపోయి మల్కాజిగిరి వస్తే వారి దయాదాక్షిణ్యాలతో గెలిచారని ధ్వజమెత్తారు. ఈ ప్రచారంలో బీజేపీ జిల్లా నాయకులు నర్సింగ్‌రావు, ప్రతాప్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జగన్‌రెడ్డి, నాయకులు రాజిరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, వై వెంకటేశ్, రాజు, శంకర్, కృష్ణ, సతీశ్, సుధాకర్, డీ రమేశ్, మధుసూదన్‌రెడ్డి, ఎల్లేశ్, సీతారాజ్, మహేశ్ పాల్గొన్నారు.