calender_icon.png 23 October, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఏ బాధ రానియ్యం

23-10-2025 02:01:48 AM

-తెలంగాణలో తొలి పత్తి  కొనుగోలు సెంటర్‌ను హుస్నాబాద్‌లో ఓపెన్ చేసినం

-వడ్లు కొన్న 48 గంటల్ల్లోనే  పైసలు ఇస్తున్నం

-ఆయిల్ పామ్, హార్టికల్చర్, సెరికల్చర్‌ను డెవలప్ చేస్తున్నం

-మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, అక్టోబర్ 22 : రైతులకు తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, వారికి ఎలాంటి కష్టం రానివ్వబోమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పత్తి, మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు వేసిన నుంచి ఉత్పత్తులు అమ్మకునేదాకా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలి పత్తి కొనుగోలు కేంద్రాన్ని హుస్నాబాద్ లో ఓపెన్ చేసినట్టు చెప్పారు.

సీసీఐ ఆధ్వర్యంలో 12 రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ’కపాస్ కిసాన్ మొబైల్ యాప్’ కింద ఆన్లైన్ ద్వారా ఏ జిన్నింగ్ మిల్లు ఉంటే అక్కడ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సూచిస్తుందని, రైతులకు తేదీ, స్లాట్ను కేటాయిస్తారని వివరిం చారు. ఈ యాప్ ద్వారా పత్తిని అమ్ముకోవడం రైతులకు ఒక రాజ మార్గం వంటిదని, ప్రస్తుతం పత్తికి రూ. 8,100 మద్దతు ధర ఉందని తెలిపారు. ఈసారి భారీ వర్షాలు పడడం వల్ల దిగుబడి కొంత తక్కువగా ఉన్నా, రైతులు ఆందోళన చెందవద్దన్నారు.

మక్కల కొనుగోలు కూడా ప్రభుత్వం చేపట్టిందని, రూ. 2,400 కనీస మద్దతు ధరతో వ్యవసాయ మార్కెట్ యార్డు కేంద్రాల్లో కొనుగోలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సంబంధించి ఏ ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వరి, మక్కజొన్న కేంద్రాలు ప్రారంభించి రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిందన్నారు.

సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని, వడ్లు కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. ఆయిల్ పామ్, హార్టికల్చర్, సెరికల్చర్ పై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసుకొని పంట పొలాలకు నీళ్లు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.