23-10-2025 01:40:00 AM
చిన్నచింతకుంట, అక్టోబర్ 22: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వేడుకలు ప్రారంభం అవుతున్న సందర్భంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుందామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు, అన్ని శాఖల జిల్లా అధికారులు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించాలని కోరారు.
అలంకార మహోత్సవం రోజు, ఉద్దాల ఉత్సవం రోజు ప్రజలు లక్షలాదిగా తరలి వస్తారని, వీఐపీలకన్న సామాన్య భక్తులకే ప్రాధాన్యమివ్వాలని, భక్తులకు ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశిస్తూ, అంద రం కలిసికట్టుగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సంబంధిత అధికారులకు అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉన్నారు.