24-01-2026 12:00:00 AM
కామారెడ్డి అర్బన్, జనవరి 23, (విజయక్రాంతి): జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించ బడింది. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ పాల్గొని జిల్లా అధికారులు, కలెక్ట రేట్ వివిధ విభాగాల సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.
ఓటరు ప్రతిజ్ఞ..
భారతదేశ పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడుతూ, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల పవిత్రతను నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు లోనుకాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు హక్కును వినియోగిస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్కే గ్రూప్ ఆఫ్ కళాశాలలో ఓటర్స్ డే ప్రతిజ్ఞ
ప్రభుత్వ ఆదేశానుసారం నేడు స్థానిక ఆర్కే , ఎస్‌ఆర్కే , విఆర్కే కళాశాలల్లో ఓటర్స్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో NSS యూనిట్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకి ఎమ్మార్వో జనార్దన్, ఎస్త్స్ర రంజిత్, ఆర్కే గ్రూప్ సిఈఓ డా|| జైపాల్ రెడ్డి, హాజరై విద్యార్థులకు ఓటు ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం విద్యార్థులచే ఓటర్స్‌డే ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి విద్యార్థి ఓటర్‌గా నమోదు చేసుకొని, ఓటు వేయాలని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి తెలియపరచాలని, నిజాయితీ పరులకు ఓటు వేసి దేశభక్తి చాటాలని తెలియజేశారు. ఎమ్మార్వో జనార్దన్, ఎస్త్స్ర రంజిత్, ఆర్కే సీఈవో డా. జైపాల్ రెడ్డి, ప్రిన్సిపల్స్ దత్తాత్రి, నవీన్, గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, శంకర్ , తిరుపతిరెడ్డి, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు లింగం, మురళి, రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.
మోర్తాడ్ తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ దినోత్సవ వేడుకలు
మోర్తాడ్, జనవరి 23 (విజయ క్రాంతి): శుక్రవారం తహసీల్దార్, మోర్తాడ్ చిలుకలు క్రిష్ణ ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఓటర్ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్యముపై విశ్వాసముతో మనదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయలను స్వేచయుత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, కులం, జాతి, భాషా, లేదా ఎలాంటి ఒత్తిడిలకు లోనవ్వకుండా ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తామని నిర్భయంగా ప్రతిజ్ఞ చేశారు. తహశీల్దార్ కృష్ణ, గిరిదవర్ రంజీత్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రామేశ్వర్పల్లిలో జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా
భిక్కనూర్, జనవరి 23 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం రామేశ్వర్పల్లి గ్రామంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువ ఓటర్లు, ప్రజాప్రతి నిధులు, గ్రామస్తులతో కలిసి ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఓటు హక్కు కీలకమని, ప్రతి ఒక్కరూ కుల, మత, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటరు పాత్ర అత్యంత ముఖ్యమని తెలిపారు. ఓటు హక్కు వినియోగంతోనే ప్రజల ఆశయాలు ప్రతిఫలిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ వినోద్ గౌడ్, వార్డు సభ్యులు మద్ది కృష్ణారెడ్డి, తేలు భవాని పాల్గొన్నారు. అలాగే జీపీవో సంతోష్, పంచాయతీ కార్యదర్శి శ్యామ్, బీఎల్వోలు, పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.