24-01-2026 12:00:00 AM
నేడు జాతీయ బాలికా దినోత్సవం :
అనాదిగా సమాజంలో బాలిక పట్ల నిర్లక్ష్యం, చిన్నచూపు, అవహేళన కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు నిరక్షరాస్యత, అవగాహన లేమితో బాలికపై అసమానతలు ఉన్నాయంటే దానికో అర్ధముంది. కానీ ఇవాళ మనిషి కాలంతో పరిగెడుతూ కంప్యూటర్, అంతరిక్ష రంగాల్లో సత్తాను చాటుతున్న సందర్భం. అయినప్పటికీ కూడా నేటికి సమాజంలో ఆడపిల్లపై అసమానత ఎందుకు పాటిస్తున్నారనే దానిపై సమాధానం చెప్పాల్సిన అవసరముంది. కుమారుడు జన్మిస్తే చాలు సంతోషాలు, సంబరాలు హట్టహాసాలతో విందులు, వినోదాలు చేసుకునే పరిస్థితిని ఇప్పటికీ దేశంలో చూస్తూనే ఉన్నాము.
కానీ అదే అమ్మాయి జన్మిస్తే మాత్రం అదేదో తప్పు జరిగిపోయినట్లు భర్తతో సహా అతని కుటుంబసభ్యులు కన్నతల్లిపై ఒకింత కోపం, అసహనం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇక అదనపు కట్నం, బంగారం కోసం అదేదో జన్మ హక్కు అంటూ భార్యపై హుకుం జారీ చేసి వాటిని సాధించడం పరిపాటిగా మారింది. కానీ ఈ విధానంలో మార్పు రావాల్సిన అవసరముంది. అందుకే దేశంలోని బాలికలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి, తగిన అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జనవరి 24న కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ జనవరి 24ను జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుతుంది.
నిజానికి భారత చరిత్రలో బాలికలు, మహిళలు సమాన అవకాశాలకు నోచుకోలేదు. ఈ క్రమంలో బాలిక, మహిళా విద్యాభివృద్ధికి మొట్టమొదట కృషి చేసిన వ్యక్తులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు. వారి వల్లనే ఈ దేశంలో ఆడపిల్లలు, యువతులు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. రాజ్యాంగం సూచించిన ప్రత్యేక చర్యలతో వారి అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. పదేళ్ల క్రితం పిల్లల లింగ నిష్పత్తి పెంచడం, బాలికల విద్య కొరకు బేటీ బచావో బేటీ పడావో కీలక పథకం తీసుకువచ్చింది. ఈ క్రమంలో బాలికల లింగ నిష్పత్తి చాలా మెరుగుపడింది.
మహిళలు సంస్థాగత ప్రసవాలు పెరిగాయి. శ్రామిక శక్తిలో వారి భాగస్వామ్యం పెరుగుతుంది. ఇది గొప్ప విజయం. ఇంకా పురోగతి సాధించాల్సిన అవసరం ఉంది. బాల్య వివాహ నిషేధ చట్టం, 2006; పోక్సో చట్టం, 2012; సుకన్య సమృద్ధి యోజన, పోషణ్ అభియాన్, మిషన్ వాత్సల్య మొదలైన చట్టాలు, పథకాలు ఆడపిల్లల భద్రతకు, ఎదుగుదలకు ఉద్దేశించినవి. వీటిని పటిష్టంగా అమలుపరచాల్సిన అవసరముంది. పౌర సంస్థలు, ప్రభుత్వాలు బాలికల హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ వారి అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలి.
తల్లిదండ్రులు ఆడపిల్లలను సంస్కృతి సంప్రదాయాల పరిధిలో బంధించి వారి సాధికారతను అడ్డుకోవద్దు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు విద్యావకాశాలను కల్పించి ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రోత్సహించాలి. అప్పుడే ఆడపిల్లల పట్ల వివక్ష తొలగిపోయి రాజ్యాంగం సూచించిన లింగ సమానత్వం సాధ్యమవుతుంది.
బాలికలకు సమాజంలో రక్షణ ఉందనే నమ్మకాన్ని కల్పించే బాధ్యత ప్రభుత్వం, పౌర సమాజం తీసుకోవాలి. ఆడపిల్లల ఉన్నతికి సహకరిద్దాం అనే నినాదంతో ముందుకెళ్దాం. ఇప్పటికైనా బాలిక, బాలుడు అనే మూర్ఖ ఆలోచన, సంకుచిత భావాలను పక్కన పెట్టాలి. మనమంతా మనుషులం.. అందరం ఒక్కటే అనే భావనతో ముందుకెళ్తూ ఆడపిల్లలను కాపాడుకుందాం. బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
తాళ్లపెల్లి సురేందర్, 9440715635