24-12-2025 12:00:00 AM
ఆరావళి పర్వత శ్రేణులు.. భూమిపై అత్యంత పురాతన పర్వతాల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి. వందల కోట్ల ఏళ్లుగా కఠిన పరీక్షలు ఎదుర్కొని ఠీవీగా నిలబడ్డ ఆరావళి శ్రేణులు.. నేడు మనిషి మాయలో పడి తమ ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. ఈ పర్వత శ్రేణులు గుజరాత్ మొదలుకుని ఢిల్లీ దాకా దాదాపు 670 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఆపార కాలుష్యాన్ని వీలైనంత మేరకు తగ్గిస్తున్నాయి.
ఆరావళి పర్వత శ్రేణుల నిర్వచనం పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఏమిటన్న దానిపై సుప్రీంకోర్టు చాలా కాలంగా విచారణ జరుపుతూ వస్తోంది. ఈ విషయంలో కేంద్రం వాదనతో ఏకీభవిస్తూ గత నెల 20న కోర్టు తీర్పు వెలువరించింది. దాని ప్రకారం పరిసర ప్రాంతాలతో పోలిస్తే కనీసం 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న గుట్టలను మాత్రమే ఆరావళి ప్రాంతంగా గుర్తిస్తారని పేర్కొంది. అయితే ఆరావళి రగడ ఇప్పటిది కాదు.
తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి ఆరావళి అంశం రగులుకుంది. హరియాణాలోని రియల్టీ, ఇన్‌ఫ్రా వ్యాపార దిగ్గజాలకు మేలు చేసేందుకే కేంద్రం ఈ వాదన లేవనెత్తిందని, తప్పుబట్టాల్సిన సుప్రీంకోర్టు కేంద్రానికి వత్తాసు పలకడమేంటని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు ఆరావళి పర్వత శ్రేణుల్లో దాదాపు 90 శాతం ప్రాంతం 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తే ఉంటుందని పర్యావరణవేత్తలు గుర్తుచేస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో ఖనిజాల తవ్వకాన్ని అనుమతిస్తే జీవవైవిధ్యాన్ని చేతులారా నాశనం చేసుకోవడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. థార్ ఎడారి సహా రాజస్థాన్‌లోని ఇతర ఎడారుల నుంచి వీచే వేడిగాలుల ప్రభావం హర్యానా మీదుగా, ఢిల్లీ, గుజరాత్‌లకు విస్తరించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఆరావళి పర్వతాల పరిరక్షణ కోసం గతంలో కోర్టులు చాలా తీర్పులే ఇచ్చాయి. మైనింగ్ కార్యకలాపాలు ప్రజా సంక్షేమానికి ఏ విధంగా హాని చేస్తున్నాయో 90 దశకంలోనే సుప్రీంకోర్టు వివరించింది.
వందలాది క్వారీలను మూసివేయాలని ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసులో తీర్పునిచ్చింది. పర్యావరణ సమతూక స్థితిని కాపాడేందుకు తవ్వకాలపై నిషేధం విధించింది. తాజాగా సుప్రీంకోర్టు వంద మీటర్ల కన్నా తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతంలో మైనింగ్ జరుపుకోవచ్చునని అనుమతి ఇవ్వడం వల్ల ఆరావళి పర్వత శ్రేణులకు ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆరావళి విషయంలో వివక్షాలు, పర్యావరణవేత్తల ఆందోళనలను కొట్టిపారేసింది.
ఆరావళి శ్రేణుల నిర్వచనం విషయంలో సుప్రీంకోర్టు నిజానికి ఎలాంటి సదలింపులూ ఇవ్వలేదని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఆరావళి శ్రేణుల్లో కేవలం 0.19 శాతం ప్రాంతంలో మాత్రమే మైనింగ్‌కు అనుమతిస్తున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం 90 శాతం పర్వతాలను పూర్తిస్థాయిలో పరిరక్షిస్తుందన్నారు.
ఇక ఆరావళి పర్వత శ్రేణుల విషయమై కేంద్రం నిర్వచనాన్ని సుప్రీంకోర్టు సమర్థించడాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని చాలా ప్రాంతాల్లో ‘సేవ్ ఆరావళి’ పేరిట ఆన్‌లైన్ ఉద్యమం ఊపందుకుంది. అయితే అమూల్యమైన, అపురూపమైన ఖనిజాల కోసం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.అంతిమంగా చారిత్రక నేపథ్యం కలిగిన ఆరావళి సహజసంపదను కాపాడుకోవాల్సిన అవసరముంది.