24-12-2025 12:00:00 AM
నేడు పెరియార్ రామస్వామి వర్ధంతి :
భారతదేశంలో మొట్టమొదట విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసిన వ్యక్తి పెరియార్ ఇ.వి రామస్వామి. ఆయన గొప్ప రాజకీయవేత్త, ఆత్మగౌరవ ఉద్యమం వ్యవస్థాపకులు. 1879లో తమిళనాడు లోని ఈరోడ్‌లో జన్మించిన పెరియార్ తన జీవితంలో కులాధిపత్యం అణచివేత, చాందస భావాలపై ఆత్మగౌరవ రణభేరి మోగించిన విప్లవ నాయ కుడు. ముఖ్యంగా ఆయన నాయకత్వం వహించిన ఆత్మగౌరవ ఉద్యమం తమిళనాడు ప్రజల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనంలో పెను మార్పులు తీసుకొచ్చింది.
దక్షిణ భారతదేశంలో ద్రవిడ ఉద్యమానికి ఆజ్యం పోసింది. వెనకబడిన వర్గాల్లో చైతన్యాన్ని రగిలించింది. తమిళనాడులో 1925లో ఇ.వి. రామస్వామి ఆత్మగౌరవ ఉద్యమం ప్రారంభించారు. ఈ ఏడాదితో ఆ ఉద్యమానికి వందేళ్లు పూర్తవుతాయి. ఈ ఉద్యమం ద్వారా వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న కుల వ్యవస్థ, బ్రాహ్మణ ఆధిపత్యం, సామాజిక అసమానతలపై సవాల్ విసిరింది. మహిళలు వివక్షతను అంతమొందించడానికి ఆయన ఎనలేని కృషి చేశారు.
పూజారులు లేకుండా ఆత్మగౌరవ వివాహా లు జరిపారు. హేతుబద్ధమైన ఆలోచనను ప్రోత్సహిస్తూ, గుడ్డి ఆచారాల ను వ్యతిరేకిస్తూ శాస్త్రీయ దృక్పథానికి పెద్దపీట వేశారు. ఆయన సంస్కరణవాద, తార్కిక ఆలోచనలను వ్యాప్తి చేయడానికి ‘కుడి అరసు’ పేరుతో వారపత్రిక ప్రచురించారు. కేరళలో 1924-25లో అంటరానితనానికి వ్యతిరేకంగా, ఆలయ ప్రవేశ హక్కుల కోసం జరిగిన వైకోమ్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు.
వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు, విద్యావకాశాలు వంటి ప్రగతిశీల సామాజిక విధానాలను పునాది పడేందుకు పెరియార్ కారణమయ్యారు. ఆయన ఆత్మగౌరవ ఉద్యమ ప్రభావంతో లౌకిక, సమానత్వ భావాలు భారత రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. ప్రశ్నించడం, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడం లాంటి అంశాలను ప్రాథమిక విధుల్లో అధికరణ 51 ఎ(హెచ్)లో పొందుపరిచారు. పెరియార్ ఆత్మగౌరవ నినాదంతో ద్రావిడ కజగం అనే రాజకీయ సంస్థను ఏర్పాటు చేశారు.
దీని నుంచే తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేలు పుట్టాయి. పెరియార్ ప్రభావంతో కరుణానిధి ఆత్మగౌరవ భావాలను యువతలో వ్యాప్తి చేశారు. పెరియార్ ఆత్మగౌరవ పునాదుల మీదనే దేశంలో అట్టడుగు వర్గాల నుంచి పలు రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో వెనకబడిన వర్గాల నుంచి ఆవిర్భవించిన పార్టీలే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో ‘42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి’ పోరాటం తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తుంది.
అయితే భారతదేశ చరిత్రలో పెరియార్‌ను హిందీ వ్యతిరేక ఉద్యమకారుడిగా, ఉత్తర భారత వ్యతిరేకిగా, హేతువాదిగా చిత్రీకరించి ఆయన అసలైన ఆత్మగౌరవ రాజ్యాధికార పోరాటాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతుంది. బహుజన రాజ్యాధికార యోధుడు కాన్షీరాం సైతం పెరియార్‌ను ఉత్తర భారతదేశంలో పరిచయం చేసి ఆత్మగౌరవాన్ని ప్రబోధించారు. రాజ్యాధికార పోరాటాలకు ఆత్మగౌరవమే ఆయుధం కావాలని పెరియార్ ఉద్యమం నోక్కి చెబుతోంది. ఆయన స్పూర్తితో భవిష్యత్తు రాజకీయాలను శాసించాలి.
సంపతి రమేష్ మహారాజ్