calender_icon.png 27 January, 2026 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైకిల్ తొక్కేద్దామా..!

06-01-2025 12:00:00 AM

ఎలా ప్రారంభించాలి?

దీర్ఘకాలిక లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ముందుగా డాక్టర్‌ను సంప్రదించడం మాత్రం మరవొద్దు. అవి హృదయ సంబంధ వ్యాధులు లేదా కీళ్ల సమస్యలు, సురక్షితంగా పని చేసే సామర్థ్యానికి ఆటంకం కలిగించవచ్చు. వైద్యులు అనుమతిస్తే.. వారానికి రెండు సార్లు 20 నుండి 30 నిమిషాల సైకిల్ తొక్కడం ఉత్తమం. 

వ్యాయామం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయో.. అలాగే సైక్లింగ్ వల్ల కూడా అంతకంటే ఎక్కువ లాభాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు. రోజూ కొద్దిసేపు చేస్తే సైక్లింగ్‌తో మంచి లాభాలు కనిపిస్తాయి. శక్తి పెంచు కోవాలన్నా, రోజువారి సామర్థ్యం మెరుగుపరుచుకోవాలన్నా సైక్లింగ్ బెస్ట్ ఆప్షన్. పెద్దలు ప్రతి వారం కనీసం 150 నిమిషాలపాటు మితమైన వ్యాయామం చేయాలని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. అందుకే 30 శాతం అమెరికన్స్ వారానికి ఒకసారి లేదా అంతకంటే ఎక్కువ సైక్లింగ్ చేస్తున్నారు. 

పెద్దవారిలో సహజంగానే రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. తక్కువ కణాల ఉత్పత్తి కారణంగా అనేక వ్యాధులు శరీరంపై దాడి చేస్తాయి. సైక్లింగ్ వృద్ధాప్య ప్రభావాలను దూరం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. అదే సమయంలో శరీర కొవ్వు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అయితే వ్యాయామం తర్వాత అలసట అనిపించడం చాలా సాధారణం.

తీవ్రమైన వ్యాయామం కొంతమంది వృద్ధులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ప్రత్యేకించి కీళ్ల నొప్పుల సమస్యలూ బాధిస్తుంటాయి. అందుకే చాలామంది సైక్లింగ్‌ను ఎంచుకుంటున్నారు. స్విమ్మింగ్ లాగా తక్కువ ఒత్తిడితో కూడుకున్న వ్యాయామం ఇది. సైక్లింగ్ ఒంటరి ప్రపంచానికి దూరంగా ఉండటానికి, ప్రశాంతంగా ఉండటానికి మంచి మార్గం. ఈ కారణంగానే సైక్లింగ్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ క్రమంలో సీనియర్ సీటిజన్స్ కోసం దేశవ్యాప్తంగా సైక్లింగ్ గ్రూపులు ఉన్నాయి. 

సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాల్లో మరొకటి గుండె ఆరోగ్యంగా ఉండటం. ఇది మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని 45 శాతం తగ్గిస్తుంది. నిజానికి క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. ప్రతిరోజూ సుమారు 30 నిమిషాలు సైక్లింగ్ తొక్కడం ద్వారా మధుమేహం, మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

సైక్లింగ్ సరైన కార్డియో వర్కవుట్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కాళ్లు, తుంటి ఎముకలు బలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా సైకిల్ తొక్కడం వల్ల శరీరం, మనస్సును రిలాక్స్ చేస్తుంది. ఇది ఆందోళన స్థాయిలను తగ్గించడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. ఎక్కువగా సైక్లింగ్‌కు వెళ్లేవారిలో మానసిక ఆరోగ్యం ముప్పు తక్కువగా ఉంటుందని పలు సర్వేల్లో తేలింది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక కూడా. 

అయితే సైకిల్ తొక్కడం కేవలం చిన్నపిల్లల పని అనుకుంటారు చాలామంది. సైకిల్ రెగ్యులర్‌గా తొక్కేవారు ఇతరులతో పోలిస్తే ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు. గుండె, శ్వాసకోశ వ్యవస్థకు సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థను చురుగ్గా చేసి ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది.

దీనివల్ల అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు. శరీర భాగాలకు ఆక్సిజన్‌తో పాటు ఇతర పోషకాలు సక్రమంగా అందుతాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సైక్లింగ్ చేయడం ప్రారంభించాక నెల రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా మెదడు పనితీరును మార్చడానికి ఇది మేలు చేస్తుంది. తొడలు, పొట్ట దగ్గర అధికంగా కొవ్వు పడితే సైక్లింగ్ చేయడం ఉత్తమం.  

మరికొన్ని ప్రయోజనాలు 

  • ఒత్తిడి అదుపులో
  • బరువు తగ్గడం
  • జ్ఞాపకశక్తి మెరుగుపడటం
  • క్యాన్సర్ ప్రమాదం తగ్గుదల
  • గ్రూపుగా వ్యాయామం చేయడానికి మంచి మార్గం
  • శరీర దృఢత్వం