06-01-2025 12:00:00 AM
రేఖ.. బాలీవుడ్‌లో ఓ సంచలనం.. అందం, అభినయంతో.. ఓ ఊపు ఊపేసింది.. నటి మాత్రమే కాదు.. గొప్ప డ్యాన్సర్, సింగర్, పోయెట్ కూడా. ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 200 చిత్రాల్లో నటించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. ఉత్తమ నటిగా ఆమెను కేంద్ర ప్రభుత్వం 2010లో పద్మశ్రీతో సత్కరించింది. తాజాగా ఐఫా అవార్డులో.. వన్నెతరగని అందంతో సందడి చేశారు.
రేఖ 1954 అక్టోబరు 10న చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ప్రముఖ నటుడు జెమినీ గణేషన్, తల్లి నటి పుష్పవల్లి. ‘ఇంటి గుట్టు’, ‘రంగుల రాట్నం’ చిత్రాల్లో బాల నటిగా తన సినిమా కెరీర్‌ను ప్రారంభించింది. కన్నడ చిత్రం ‘ఆపరేషన్ జాక్‌పాట్ నల్లి సీఐడీ 999 (1969)తో ఆమె నటిగా మొదటి చిత్రంలో మెరిసింది. ఇక ఆ తర్వాత రేఖ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1970లో నవీన్ నిశ్చల్ పక్కన హీరోయిన్‌గా బాలీవుడ్‌లో అరంగ్రేటం చేశారు ‘ఖూబ్‌సూరత్’ లో ఆమె నటనకు ఉత్తమ నటిగా మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. తర్వాత ‘ఉమ్రావ్ జాన్’ పాత్రకు ప్రాణం పోసింది రేఖ. అమె నటనకుగాను ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం లభించింది.
అమితాబ్‌తో పరిచయం..
బాలీవుడ్ అగ్రనటులు రాజేష్ ఖన్నా, అమితాబ్, ధర్మేంద్ర, వినోద్ ఖన్నా, రాజేంద్ర కుమార్, సంజీవ్ కుమార్, జితేంద్ర, మిథున్ చక్రవర్తి, రిషి కపూర్ వంటి హీరోల సరసన ఎన్నో సినిమాల్లో నటించింది. 1976లో ‘దో అంజానే’ లో అమితాబ్‌తో కలిసి నటించాక రేఖ జీవితం మారిపోయింది. జీవితాన్ని, కెరీర్‌ను సీరియస్‌గా తీసుకోవడం అమితాబ్ నుంచి రేఖ నేర్చుకుంది.
ఆమె అమితాబ్‌ను పేరు పెట్టి ఎప్పుడూ పిలవదు. ‘ఓ’ (వారు, ఆయన) అంటుంది. పత్రికలు కూడా ‘ఓ’ అనే రాసేవి. అమితాబ్, రేఖల జోడి సూపర్ హిట్ అయింది. ఆలాప్, ఖూన్ పసీనా, మొకద్దర్ కా సికిందర్, మిస్టర్ నట్వర్‌లాల్, రామ్ బలరామ్, సుహాగ్, సిల్‌సిలా, ఆమ్‌స్టర్ డామ్ డచ్ తులిప్ పూల మధ్య రేఖ, అమితాబ్‌ల మధ్య సాగే ‘దేఖా ఏక్ ఖ్వాబ్‌తో ఏ సిల్‌సిలే హుయే’ పాట అత్యంత రొమాంటిక్‌గా నిలిచిపోయింది.
కవర్ గర్ల్‌గా..
నటిగా దేహానికి మించిన పెట్టుబడి లేదని, దాని పోషణ ప్రథమమని గ్రహించిన మొదటి నటి రేఖ. బాలీవుడ్‌లో ఆమె వల్లే యోగా, ఏరోబిక్స్ పరిచయం అయ్యాయి. మేకప్ రహస్యాలు నటికి తెలిసి ఉండాలని లండన్ వెళ్లి మేకప్ కోర్సు చేసి వచ్చిందామె. రేఖ ప్రత్యేకంగా ఫొటో షూట్స్ చేసి ఆ స్టిల్స్ పత్రికలకు ఇచ్చేది. అందువల్ల ఆమె ఎప్పుడూ కవర్ గర్ల్‌గా నిలిచేది. ఆ తర్వాత హీరో హీరోయిన్లు ఆ ట్రెండ్‌ను ఫాలో అవక తప్పలేదు.
ప్రేమ పాటలు
ఘర్ మూవీలోని.. తేరే బినా జియా జాయేనా, ఆజ్‌కల్ పావ్ జమీ పర్ ఇప్పటికి వింటుంటారు ప్రేమికులు. సున్ దీదీ సున్ తేరేలియే (ఖూబ్ సూరత్), సలామే ఇష్క్ మేరీ జాన్(ముకద్దర్ కా సికిందర్), గుమ్ హై కిసీ కే ప్యార్ మే (రామ్‌పూర్ కా లక్ష్మణ్), ఏ కహా ఆగయే హమ్ (సిల్‌సిలా) పాటలకు ఫిదా అవుతుంటారు అభిమానులు.
ప్రత్యేక గుర్తింపు..
1978లో గుల్జార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఘర్’ సినిమా రేఖలోని సమర్థమైన నటిని ప్రేక్షకులకు చూపింది. ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్. శ్యామ్ బెనగల్ ‘కలియుగ్’, గిరిష్ కర్నాడ్ ‘ఉత్సవ్’, ‘ఆస్థా’ రేఖ నటనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆ తర్వాత యాక్షన్ సినిమాలకు మళ్లీ.. ‘ఖూన్ భరీ మాంగ్’, ‘ఫూల్ బనే అంగారే’ వంటి మూవీల్లో నటించారు. ‘కల్ హూన హూ’, ‘క్రిష్’ వంటి సినిమాల్లో తల్లి, బామ్మ పాత్రలు పోషించారు. 2012లో రాజ్యసభకు సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.