28-10-2025 01:07:13 AM
హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి) : రేవంత్ రెడ్డి క్యాబినెట్ కచ్చితంగా దండుపాళ్యం ముఠానే అని, ఈ మాటను ఒక్కసారి కాదు పదిసార్లు అంటానని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఉన్న విషయం మాట్లాడితే కొందరు మంత్రులకు ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ ముధోల్ నియోజకవర్గ నేత సిందే దీక్షిత్ ఆయన అనుచరులతో కలిసి సోమవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
వారిని హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... మంత్రుల పంచాయితీల పరిష్కారం కోసమే క్యాబినెట్ సమావేశాలు పెట్టుకుంటున్నారా అని ప్రశ్నించారు. దక్కన్ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించిన వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దమ్ముంటే జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ఒక్క భవనం కట్టలేదు కానీ కటింగ్ మాస్టర్‌గా మారారని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్‌లో పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ వెనక్కి పోయిందని, ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దన్న రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టిందని గుర్తు చేశారు. యూరియా బస్తా కూడా ఇవ్వలేని అసమర్థత సర్కార్ ఇదని, యూరియా బస్తాల కొరతతో పంట దిగుబడి తగ్గే ప్రమాదం వచ్చిందన్నారు.
రేవంత్ రెడ్డి పాలనలో అన్నీ సగం..సంగం, ఆగం..ఆగం అని ఎద్దేవా చేశారు. ప్రజలు రేవంత్ రెడ్డి పాలనపై అగ్రహంగా ఉన్నారని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పరిగెత్తాలని, స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్‌ఎస్ విజయం సాధించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లాలో అన్ని సీట్లనూ బీఆర్‌ఎస్ గెలవాలని సూచించారు.
రేవంత్‌రెడ్డి అడ్డమైన మాటలతో అధికారంలోకి..
రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు ప్రజలు అదే భాషలో రేవంత్ రెడ్డిని తిడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ భవన్ లో రజక సంఘం కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత బూతులు తప్ప ఏం లేవని ప్రజలు భావిస్తున్నారని, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా రంటే ప్రజలు చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు.
ఇన్ని తిట్లు తిన్న ముఖ్యమంత్రిని ‘నేనెప్పుడూ చూడలేద’ అనిని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఓట్లప్పుడు చెప్పినవి, చెప్పనివి చేశారని, రేవంత్‌రెడ్డి మాత్రం ఉన్న పథకాలకు కూడా కత్తెర పెట్టారని విమర్శించారు. ఉన్న ఇళ్లకు కేసీఆర్ పట్టాలిస్తే రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపి వాటిని కూలగొట్టారని వివరించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే మొత్తం తెలంగాణకు లాభం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలోని రజకుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ పెంచారని, కేసీఆర్ వచ్చినాకనే చాకలి ఐలమ్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని తెలిపారు. అడగక పోయినా రజకులకు 250 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చారని, కానీ రేవంత్ రెడ్డి కరెంట్ బిల్లు వేస్తున్నారని మండిపడ్డారు. బోరబండలో ఉండే బాలమణి ఇస్త్రీ పెట్టే దుకాణానికి 31 వేల కరెంట్ బిల్లును రేవంత్‌రెడ్డి పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గూబ గుయిమ నిపించాలని పిలుపునిచ్చారు. చపాతి మేకర్, రోడ్ రోలర్ గుర్తులు పెట్టించి కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డిది దింపుడు కళ్లెం ఆశ అని ఎద్దేవా చేశారు. సునీతమ్మకు ఓటు గుద్దితే కాంగ్రెస్‌కు బుద్ధి రావాలన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రజక సోదరుల గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్‌దని హామీ ఇచ్చారు.