20-09-2025 06:24:23 PM
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను అన్ని హంగులతో మారుద్దాం
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి (విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలను అన్ని విధాలుగా తీర్చిదిద్దడమే కాకుండా వెయ్యి మందికి సరిపడే హాస్టల్ భవనాన్ని అన్ని వసతులతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(TPCC Working President Jagga Reddy) కోరారు. శనివారం ఆయన కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలకు అవసరమయ్యే అవసరాలను ప్రిన్సిపాల్ వివరించారు. మాకు హాస్టల్ రూమ్స్, సెక్యూరిటీ కావాలని, ప్రస్తుతానికి 500 మంది విద్యార్థులు వున్నారని చెప్పారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది 31ఉన్నారని, హాస్టల్లో అన్ని వసతులు ఉంటే 1300 మంది చదువుకోవచ్చని వివరించారు. వసతులు లేనందున ఇప్పటికే 25 మంది టీసీలు తీసుకున్నారని, ఇంకా 30 మంది రెడీ గా ఉన్నట్లు చెప్పారు. కాగా హాస్టల్ భవనం 8 నెలల క్రితం పీఎం ఉషా పథకం కింద ప్రారంభమైందని, కానీ అదనపు గదులు లేవని చెప్పారు. దీంతో స్పందించిన జగ్గారెడ్డి హాస్టల్ లో అదనంగా 300 మంది ఉండేలా క్లాస్ రూమ్స్, హాస్టల్, వసతి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపదనలు పంపించాలని, ఒక్కో రూమ్ లో 12 మంది ఉండేలా హాస్టల్ రూమ్స్ డిజైన్ చేయాలన్నారు.
మొత్తంగా వెయ్యి మందికి హాస్టల్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అక్టోబర్ 10 వరకు ప్రతిపాదనలు సిద్దం చేసి ఇవ్వాలన్నారు. ఎడ్యుకేషన్ కోసం క్లాస్ రూమ్స్, స్టాఫ్, లైబ్రరీ, ల్యాబ్, ఆడిటోరియం అన్ని ఉండేలా 1000 మందితో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అలాగే సగం నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం కోసం రూ.40 లక్షలు కావాలని, నిధులు మంజూరు అయ్యేలా చూస్తానన్నారు. కళాశాలకు నారాయణఖేడ్, వికారాబాద్, జహీరాబాద్, కల్హేర్, సదాశివపేట్, జోగిపేట, తాండూరు. జిన్నారం. అందోల్, బెజ్జంకి, సిద్దిపేట, హుస్నాబాద్ నుంచి వస్తున్నారని, ఉర్దూ చదివే బీఏ విద్యార్థులు 180 మందికి, బీకామ్ కోసం ప్రతిపాదనలు పెట్టినట్లు తెలిపారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ దృష్టికి తీసుకెళ్తానని, ప్రభుత్వ నిధులతో పాటు సీఎంఆర్ నిధులు వచ్చేలా చూస్తానన్నారు. తన భార్య, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల కూడా ఇదే కళాశాలలో చదివారని గుర్తు చేశారు.
పదేళ్ళు నష్టం జరిగింది...
గత పదేళ్లుగా తాను అధికారంలో లేనని, ఉమ్మడి రాష్ట్రంలో ఎంత కావాలో అంత చేశానని, పదేళ్లు ప్రజలకు నష్టం జరిగిందని జగ్గారెడ్డి తెలిపారు. రాజకీయాల మీద నాకు పెద్దగా ఆసక్తి లేదని, మా పార్టీ అధికారంలో ఉందని, తనకు సీఎం, మంత్రి సహకరిస్తారని చెప్పారు. తాను ఒక వ్యక్తిగా వచ్చానని, ఒక సంస్థను కాపాడే పని కోసం వచ్చానన్నారు. సంగారెడ్డి వాస్తవ్యుడిగా మహిళా కళాశాలను ఛాలెంజ్‌గా తీసుకొని అభివృద్ధి చేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.