calender_icon.png 9 September, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నార్సింగిలో లంచం తీసుకుంటూ అధికారిణి అడ్డంగా బుక్..

09-09-2025 05:37:30 PM

- రూ.4 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ

- ప్లాట్ LRS కోసం రూ.10 లక్షలు డిమాండ్

- కొనసాగుతున్న సోదాలు

మణికొండ: లంచం తీసుకున్న పాపానికి నార్సింగి మున్సిపల్ కార్యాలయం(Narsingi Municipal Office)లో ఓ అవినీతి అధికారిణి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయింది. టౌన్ ప్లానింగ్ అధికారిణి(టీపీఎస్) మణిహారిక రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, మంచిరేవుల ప్రాంతానికి చెందిన వినోద్ అనే వ్యక్తి తన ప్లాట్ కు సంబంధించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) క్లియరెన్స్ కోసం టౌన్ ప్లానింగ్ అధికారిణి మణిహారికను సంప్రదించాడు. ఫైల్ క్లియర్ చేయడానికి ఆమె ఏకంగా రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. లంచం ఇవ్వనిదే పని జరగదని తేలడంతో, వినోద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ఏసీబీ సూచనల మేరకు, అంగీకరించిన లంచంలో మొదటి విడతగా రూ.4 లక్షలను మంగళవారం మణిహారికకు కార్యాలయంలోనే ఇస్తుండగా, ముందుగానే మాటు వేసిన ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. టౌన్ ప్లానింగ్ అధికారిణి పట్టుబడటంతో మున్సిపల్ కార్యాలయంలోని ఇతర అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పట్టుబడిన నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, కార్యాలయంలోని ఆమె ఛాంబర్ లో, సంబంధిత దస్త్రాలపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఈమెకు సంబంధించి మరిన్ని ఆస్తులు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్టు సమాచారం.