calender_icon.png 17 May, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలిసి పనిచేద్దాం!

23-04-2025 01:33:58 AM

  1. హిరోషిమా, తెలంగాణ రెండూ పోరాటచిహ్నాలే
  2. కొత్త ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ
  3. సాంకేతిక పురోగతిలో హిరోషిమా ప్రత్యేకం
  4. హిరోషిమా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి 
  5. పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చ
  6. ప్రీఫెక్చర్ అసెంబ్లీ హాల్‌ను సందర్శించిన సీఎం బృందం

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): హిరోషిమాకు రావటం గౌర వంగా ఉందని, హిరోషిమా అంటే ఒక ఆశ అని, ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికి నిరూపించిన నగరమని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. పెట్టుబడులకు కాకుండా పరస్పర సహకారం, భాగస్వామ్యం గురించి మాట్లాడటానికి వచ్చామని, కలిసికట్టుగా మెరుగైన, పచ్చని, సమగ్రమైన ప్రపంచాన్ని నిర్మిద్దామన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని తెలంగాణ అధికారుల బృందం మంగళవారం జపాన్‌లోని హిరోషిమా ప్రీ ఫెక్చర్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా హిరోషిమా డిప్యూటీ గవర్నర్‌తో వారు సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.

సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..హిరోషిమా ప్రభుత్వ ఆతిథ్యానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శాంతితోపాటు సాంకే తిక పురోగతిలో హిరోషిమా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. తెలంగాణ కూడా కొత్త ఆవిష్కరణలు, సుస్థిర విధానాలు, శాంతియుత వాతావరణానికి కట్టుబడి ఉందన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తెలంగాణ, హిరోషిమా కలిసి పనిచేయగలిగే రంగాలపై విస్తృతంగా చర్చలు జరిగాయన్నారు.

వ్యర్థాల నుంచి ఇంధనం లాంటి క్లీన్ టెక్నాలజీ, మున్సిపాలిటీల్లో వ్యర్థాల ప్రాసెసింగ్, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు, అర్బన్ ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్‌లో విపత్తుల నివారణ డిజైన్లు, భూగర్భ మెట్రో ఇంజినీరింగ్, స్మార్ట్‌సిటీ సొల్యూషన్స్, పారిశ్రామిక సహకారం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన ఉత్పత్తుల తయారీకి హిరోషిమా ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ కారిడార్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ప్రస్తావించారు.

వీటితోపాటు విద్య, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో తెలంగాణలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల మధ్య సంబంధాలు, పరిశోధనలకు సహకారం, తెలంగాణ సంస్కృతి, శాంతి, పర్యాటకం, పీస్ పార్క్, సాంస్కృతిక ప్రదర్శనలు, బౌద్ధ వారసత్వానికి సహకరించాలని కోరారు. 

హిరోషిమా ప్రీఫెక్చర్ సందర్శన.. 

హిరోషిమా మాదిరిగానే ప్రజల ఆశలు, ఆకాంక్షలు, పోరాటానికి చిహ్నం తెలంగాణ రాష్ట్రమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దూరదృష్టితో విజయం సాధించిన రాష్ర్టమని కొనియాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం జపాన్‌లోని హిరోషిమా ప్రీఫెక్చర్‌ను సందర్శించింది. హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ హాల్ సందర్శనకు వెళ్లిన బృందానికి అసెంబ్లీ స్పీకర్ తకాషి నకమోటో, వారి శాసనసభ్యుల బృందం ఘనంగా స్వాగతించింది.

సీఎం వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు జయేశ్ రంజన్, వీ శేషాద్రి, అజిత్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి అసెంబ్లీని సందర్శించారు. శాసనసభ్యుల సమావేశాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..శాంతి, స్థిరత్వం, సమృద్ధి వంటి విలువలను పంచుకుందామన్నారు. 

దేశానికి గేట్‌వేగా తెలంగాణ: మంత్రి శ్రీధర్‌బాబు

ఇప్పటికే యాభైకి పైగా జపాన్ కంపెనీలు తెలంగాణలో అద్భుతంగా పనిచేస్తున్నాయని, మరిన్ని కంపెనీలను స్వాగతిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ప్రిసిసన్ మ్యానుఫాక్చరింగ్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో గొప్ప అవకాశాలున్నాయన్నారు. తెలంగాణను సందర్శించి, రాష్ర్ట ప్రగతిని స్వయంగా చూడాలని హిరోషిమా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలను మంత్రి ఆహ్వానించారు.

తెలంగాణ దేశానికి గేట్ వేగా.. ప్రపంచానికి విస్తరించే వేదికగా ఉంటుందని అన్నారు. అసెంబ్లీ సందర్శన తర్వాత తెలంగాణ ప్రతినిధి బృందం హిరోషిమా చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులతో సమావేశమైంది. అనంతరం, శాసనసభ్యుల బృందం రేవంత్‌రెడ్డి బృందాన్ని గాంధీ మెమోరియల్, హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్, అణుబాంబు డోమ్‌ల వద్దకు తీసుకెళ్లింది.