19-11-2025 12:00:00 AM
విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య
భూదాన్ పోచంపల్లి, నవంబర్ 18(విజయక్రాంతి): గ్రంథాలయాలు విద్యార్థుల మనోవి కాస కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయని విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య అన్నారు. విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ లోని విజ్ఞాన ధార లైబ్రరీలో మంగళవారం విద్యార్థులకు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
గ్రంథాలయాలపై అవగాహన కల్పించ డం, పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా పుస్తక ప్రదర్శన, వ్యాస రచన పోటీలు, క్విజ్ పోటీలు, పోస్టర్ పోటీలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు తరచుగా గ్రంథాలయాలను సందర్శిస్తూ పుస్తక పఠనం చేయడం ద్వారా జ్ఞాన సంపదను పెంచుకోవాలన్నారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ గ్రంథాలయాల ప్రాముఖ్యత తగ్గలేద న్నారు.
విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు మాట్లాడుతూ ఉన్నత సమాజ నిర్మాణానికి గ్రంథాలయాలే మార్గమన్నారు. సమున్నత సమాజ నిర్మాణానికి గ్రం థాలయాలే చక్కటి మార్గాన్ని నిర్దేశిస్తాయన్నా రు. యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చని సూచించారు. విజ్ఞాన్ యూనివర్సిటీలోని విజ్ఞాన ధార లైబ్రరీలో వేల పుస్తకాలు ఉన్నాయని, అలాగే ఇక్కడ డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులో ఉందని వివరించారు. కార్యక్రమంలో డీన్లు, డైరెక్టర్లు, అధిపతులు పాల్గొన్నారు.