23-07-2025 12:00:00 AM
-నూతనంగా నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం ప్రారంభం
-నిరుద్యోగ యువత అన్ని రకాల పుస్తకాలు చదివి ఉద్యోగ అవకాశాలు పొందాలి
- ములుగు జిల్లాలో అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా
-మంత్రి సీతక్క
ములుగు,జూలై22(విజయక్రాంతి):నిరుద్యోగ యువతీ యువకులు జ్ఞానాన్ని పెంపొందించుకొని ఉద్యోగ అవకాశాలు పొందేందుకు గ్రంథాలయాలు ఎంతగానో దోహద పడతాయని, గ్రంథాలయాలు సరస్వతి నిలయాలని రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణ అభివృద్ధి, గామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
మంగళవారం రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, ములుగు జిల్లా గ్రంధాలయ చైర్మన్ బానోతు రవి చందర్,మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, అదనపు కలెక్టర్ మహేందర్ జీలతో కలిసి జిల్లా కేంద్రంలో 25లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనంను, లైబ్రరీ బిల్డింగ్ లోపల 16.50 లక్షలతో గ్రౌండ్ లెవెలింగ్ కొత్తగా నిర్మించిన టాయిలెట్ బ్లాక్, కాంపౌండ్ వాల్ ను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కూడు, గూడు, గుడ్డ ఎంత ముఖ్యమో జ్ఞానం పెంపొందించుకోవడం అంతే ముఖ్యమని అన్నారు విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు గ్రంథాలయానికి చేరుకొని పుస్తక పఠన చేసుకునే అలవాటు అలవర్చుకోవాలని సూచించారు.
ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు పొందేందుకు విద్యాలయాలు, లైబ్రరీలు ఎంతగానో దోహదపడతాయని, జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో ఆరుబయట పుస్తక పఠనం చేయడానికి 10లక్షల రూపాయలతో పలు రకాల చెట్లను పెంచడం, సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టుట జరుగుతుందని తెలిపారు. ములుగు జిల్లాలు అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందని, జిల్లా కేంద్రంలోని రోడ్లను విస్తరణ పరచడానికి చర్యలు తీసుకోవడంతో పాటు కోటి రూపాయలతో కూరగాయల మార్కెట్ ఆధునికరణ పనులను త్వరతగతిన పూర్తి చేస్తామని తెలిపారు. గ్రంథాలయాలలో పుస్తక పఠన చేసి ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరు ఏదైనా ఒక రూపంలో సహకరించి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చెయ్యాలని, పోటీ పరీక్షల సమయంలో మధ్యాహ్న భోజనం అందించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పేదలకు రేషన్ కార్డు చాలా ముఖ్యం
ములుగు, జూలై22 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు అందించాలన్న ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం నూతనంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని, రేషన్ కార్డు పేద కుటుంబాలకు ఎంతో కీలకమని రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణ అభివృద్ధి, గామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం ప్రజా పాలన ప్రగతి పథంలో భాగంగా ఎస్‌ఎస్ తాడ్వాయి,ఏటూరునాగారం,కన్నాయిగూడెం, మంగపేట మండల కేంద్రాల్లో జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ,ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి,జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ లతో కలిసి మంత్రి సీతక్క నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంలలో మంత్రి సీతక్క మాట్లాడుతూ తాడ్వాయి మండలంలో 6వందల నూతన రేషన్ కార్డులను అందించడమే కాకుండా మరో పదకొండు వందల కార్డులను మార్పిడి చేసి పంపిణీ సిద్ధంగా ఉంచామని తెలిపారు. 2013 సంవత్సరంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతి ఒక్కరికి కడుపునిండా తిండి పెట్టాలనే ఉద్దేశంతో ఆహార భద్రత చట్టం తీసుకురావడం జరిగిందని, గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడం వల్ల నిరుపేదలు కడుపునిండా తిండి తినలేక పోవడానికి గ్రహించి నేటి ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారని అన్నారు. మన రాష్ట్రంలో పండించిన సన్న వడ్లకు 5 వందల రూపాయల బోనస్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ పండించిన సన్నబియ్యాన్ని ధనవంతుడు తింటున్న విధంగానే పేదలు తినాలన్న ఉద్దేశంతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని వివరించారు. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని పథకాలను మహిళల పేరున్నే అందిస్తున్నామని, వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు.