21-11-2025 12:15:57 AM
సూర్యాపేట, నవంబర్ 20 (విజయక్రాంతి) : మంచి భవిష్యత్తుకు దారిని చూపేవి గ్రంధాలయాలు అని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. జిల్లా గ్రంధాలయ కేంద్రంలో గురువారం నిర్వహించిన గ్రంధాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే వారికి గ్రంధాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించి భవిష్యత్ లో స్థిర పడాలన్నారు.
విద్యార్థులు గ్రంధాలయంలో వార్త పత్రికలు, కథల పుస్తకాలు, నావెల్స్ చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. అదునాతన సౌకర్యాలతో నూతన భవనం త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అనంతరం గ్రంధాలయం వారోత్సవాలులో భాగంగా నిర్వహించినవ్యాస రచన, ఉపన్యాసం పోటీ, చిత్ర లేఖనం పోటీలలో ప్రతిభ చుపిన వారికి బహుమతులు అందజేశారు. తదుపరి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి లక్ష రూపాయల చెక్కును విరాళంగా గ్రంధాలయముకు అందజేశారు. ఈ కార్యక్రమములో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, కార్యదర్శి బాలమ్మ,స్థానిక ప్రతి నిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.