21-11-2025 12:14:13 AM
కోడిగుడ్ల ధరలకు రెక్కలు
మహబూబాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): చలికాలంలో.. కూరగాయల ధరలు వినగానే గుండెలు గుబేలు మంటున్నాయి. కూరగాయలు కిలోకు రిటైల్ మార్కెట్లో వంద రూపాయలకు మించి పలుకుతున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే టమా టా సైతం కిలోకి 50 రూపాయలు పలుకుతోంది. బెండకాయలు 70 కిలో, బీరకాయలు 60, చిక్కుడుకాయ 80, సొరకాయ ఒక్కటి 50, వంకాయ 60, క్యారట్ 100 ఇలా ఏ కూరగాయ ధర విన్నా సామాన్యులు ఉలిక్కి పడాల్సిన పరిస్థితి నెలకొంది.
విప రీతమైన ధర పెరగడంతో కూరగాయలు కొనేందుకు వెనక ముందు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పచ్చిమిర్చి ధర కూడా కిలో 70 నుంచి 100 రూపాయలకు విక్రయిస్తుండడంతో కూరగాయల ధరలు వినగానే సామాన్యులు హడలిపోతున్నారు. చలికాలంలో కూరగాయల ధరలు ఇలా ఒక్కసారిగా పెరిగిపోవడంతో బేజారెత్తుతున్నారు. చివరకు ఆకుకూరల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. ఆకుకూరలను కూడా కేజీ లెక్కన విక్రయిస్తున్నారు. కొత్తిమీర, పాలకూర, పుదీనా, మెంతికూర కిలోకి నూట ఇరవై రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు.
కోడిగుడ్డు ధర పైపైకి!
ఇదిలా ఉంటే కోడిగుడ్ల ధరలు కూడా రోజురోజుకు పెరుగుతూ రిటైల్ మార్కెట్లో ఒక గుడ్డు ధర ఆరు రూపాయల నుండి ఏడు రూపాయలు విక్రయిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో ఐదు రూపాయలకు గుడ్డు లభించగా ఇప్పుడు ఏడు రూపాయలకు పెరగడంతో కోడిగుడ్డు కూడా తెలియ పరిస్థితి లేకుండా పోయిందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలతో పాటు మాంసాహారం, కోడిగుడ్ల ధరలు పెరగడం వల్ల ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్లు లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.