11-08-2025 06:50:08 PM
ఎన్జీటీలో కేసు విత్ డ్రాకు ఒప్పుకున్న పర్యావరణ వేత్తలు
మర్రి చెట్ల రీ–ప్లాంట్ ప్లాన్ సబ్మిట్ చేయగానే పనులు
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వెల్లడి..
చేవెళ్ల: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి(ఎన్‌హెచ్-163) విస్తరణకు లైన్ క్లియర్ అయ్యిందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి(MLA Ram Mohan Reddy) తెలిపారు. సోమవారం మొయినాబాద్ పరిధిలో జరుగుతున్న బైపాస్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న మర్రిచెట్ల అంశంపై దృష్టి పెట్టామన్నారు. ఈ మేరకు 900 మర్రిచెట్లను తొలగించవద్దని గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసిన సేవ్ బనియన్స్ సంస్థకు చెందిన పర్యావరణ వేత్తలైన తేజపు బాలాంత్రపు, ప్రణయ్ జువ్వాడి, నటషా రామరత్నంను తన ఇంటికి పిలిచి చర్చలు జరిపినట్లు వెల్లడించారు. మరోసారి సెక్రటేరియట్లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సెక్రటరీ శ్రీనివాసులు రాజు, ఎన్ హెచ్ఏఐ పీడీ నాగేశ్వర రావు సమక్షంలో సమావేశం ఏర్పాటు చేశామన్నారు.
ఈ సందర్భంగా 900 మర్రి చెట్లలో 393 చెట్లకు పైగా బైపాసుల ద్వారా సేవ్ అవుతున్నాయని, మిగితా వాటిలో 150 చెట్లను పక్కనే ఉన్న ప్రదేశంలో రీ–ప్లాంట్ చేస్తామని ఎన్ హెచ్ఏఐ పీడీ వారికి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇందుకు అంగీకరించిన పర్యావరణ వేత్తలు రీ–ప్లాంట్కు సంబంధించిన ప్రణాళిక గ్రీన్ ట్రిబ్యునల్ లో సబ్మిట్ చేయగానే కేసు విత్ డ్రా చేసుకుంటామని మాటిచ్చినట్లు వెల్లడించారు. దీంతో పాటు మన్నెగూడ నుంచి కొడంగల్ మీదుగా తెలంగాణ బార్డర్ వరకు నాలుగు లేన్ల కొత్త రోడ్డు మంజూరైందని తెలిపారు. ఈ రోడ్డు పూర్తయితే రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.